calender_icon.png 25 February, 2025 | 10:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంటలు ఎండుతుంటే చోద్యం చూస్తారా?

25-02-2025 01:13:33 AM

కాల్వ పనుల ఆలస్యంపై కడియం శ్రీహరి ఫైర్

జనగామ, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి) : నీళ్లు లేక రైతుల పొలాలు ఎండుతుంటే కాల్వ పనులు చేయకుండా మీరేం చేస్తున్నారని కాంట్రాక్టర్, అధికారులపై స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు.

కాల్వ నిర్మాణ పనులు ఎప్పటి వరకు పూర్తి చేస్తారో సాయంత్రంలోగా తనకు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. లేదంటే నోటీసులు జారీ చేస్తానని హెచ్చరించారు.

సోమవారం ఆయన జనగామ జిల్లాలో నెల్లుట్ల జాతీయ రహదారి నుంచి జీడికల్ వరకు గల అశ్వరావుపల్లి ప్రధాన కుడి కాలువ, ఉప కాలువల నిర్మాణ పనులను పరిశీలించారు. 18 ఏళ్లుగా పాలకుల అలసత్వం, అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా పనులు ఇప్పటి వరకు పూర్తి కాలేదన్నారు. 

వర్షాకాలం లోపు జీడికల్ వరకు గోదావరి జలాలు..

భూములు కోల్పోతున్న రైతులు సహకరిస్తే ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం ఇప్పించే బాధ్యత తనదని కడియం హామీ ఇచ్చారు. ఈ సీజన్‌లోనే భూసేకరణ సమస్యలు, అసంపూర్తి పనులను పరిష్కరించి వచ్చే జూన్, జులై కల్లా జీడికల్ వరకు గోదావరి జలాలు తీసుకువస్తానని చెప్పారు. జనగామ నుంసీ జీడికల్ వరకు రోడ్డు మంజూరైందని, మేలో పనులు ప్రారంభిస్తానని తెలిపారు.

భవిష్యత్తులో బీఆర్‌ఎస్ ఉంటుందో.. లేదో..?

అధికారం కోల్పోయిన ఏడాదికే బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఆగమవుతున్నారని కడియం విమర్శించారు. ఆ పార్టీ నేతలు ఇంకా నాలుగేళ్లు ఓపిక పట్టాలని, అప్పటిదాకా బీఆర్‌ఎస్ ఉంటుందో..? భూస్థాపితం అవుతుందో తెలియని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ పరిమితికి మించి అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు.  కడియం వెంట లింగాలఘణపురం మాజీ జడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.