- పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఏం చేశారు
- లోకల్ ఎలక్షన్లు వస్తున్నాయనగానే నోరు విప్పుతున్నారు
- కేంద్రంలో అధికారంలోకి వస్తే 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్ తీసేస్తాం
- బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ నేతలు ఇప్పటికైనా బీసీల కోసం మాట్లాడడం సంతోషకరమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. అధికారంలో ఉండగా బీసీల గురించి మాట్లాడని నాయకులు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయనగానే నోరు విప్పుతున్నారని విమర్శించారు.
శుక్రవారం గాంధీభవన్‌లో రాజ్యసభ ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, పీసీసీ అధికారక ప్రతిని ధులు గౌరీ సతీశ్, చరణ్ కౌషిక్ యాదవ్, గజ్జి భాస్కర్ యాదవ్‌తో కలిసి మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు..బలహీన వర్గాలకు న్యాయం చేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ ఎజెండా అని చెప్పారు. అందుకే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుల గణన చేపట్టిందని తెలిపారు.
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్‌ను ఎత్తివేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చెప్పారని, వీలైతే ఎమ్మెల్సీ కవిత కూడా సహకరించాలని సూచించారు. రాజకీయ లబ్ధి కోసం కవిత బీసీలను ఉపయోగించుకోవాలనుకుంటే.. బీసీలు చూస్తూ ఊరుకోరని హెచ్చచరించారు.
బీసీలకు కీలక పదవులు ఇవ్వండి..
బీసీల విషయంలో కవిత మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. బీసీల గురించి మాట్లాడే ముందు బీఆర్‌ఎస్‌లోని అధ్యక్ష, వర్కింగ్ ప్రెసిడెంట్ వంటి పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలోని బీసీలందరికీ తమ హక్కుల కోసం మాట్లాడే స్వేచ్ఛ ఉందని, అదే బీఆర్‌ఎస్‌లో ఎంత స్వేచ్ఛ ఉందో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు.
బీసీలు బీఆర్‌ఎస్ వలలో పడే చాన్స్ లేదన్నారు. రైతు భరోసా ఇవ్వడానికి మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపిందని, అయితే తాము అడిగితేనే ఇచ్చామని చెప్పుకోవడానికి బీఆర్‌ఎస్ అబద్ధాలు చెబుతోందన్నారు.