calender_icon.png 19 March, 2025 | 7:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బకాయిలివ్వరా?

17-12-2024 01:15:40 AM

మాజీ సర్పంచులు బంగారం కుదువపెట్టి పనులు చేసిండ్రు

ప్రభుత్వంపై హరీశ్‌రావు ఆగ్రహం

హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): ‘మాజీ సర్పంచులు చేసిన పనులకు బిల్లులు ఇవ్వరు. అప్పులు చేసి, బంగారం కుదవపెట్టి పనులు చేస్తే.. ఆ బిల్లులైనా ఇవ్వరా? పనుల కోసం చేసిన అప్పులు కట్టలేక వారు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది.

బడా కాంట్రాక్టులకు పైసలు విడుదల చేస్తున్న ప్రభుత్వం, చిన్నిచిన్న పనులు చేసిన సర్పంచ్‌లకు బిల్లులు విడుదల చేయకుండా వారిపై పగబట్టినట్టు వ్యవహరిస్తోంది’ అని మాజీమంత్రి, బీఆర్‌ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీలో గ్రామపంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపు అంశంపై ప్రశ్నోత్తరాల సమయంలో సర్పంచులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల గురించి లేవనెత్తారు.

కాంగ్రెస్ హయాంలో బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారని, చిన్నవాళ్లకు మాత్రం ఇవ్వడం లేదని ఆరోపించారు. వాళ్లపై ఎందుకు కక్ష అంటూ ప్రశ్నించారు. బిల్లుల కోసం గవర్నర్, మంత్రులను కలిసి మాజీ సర్పంచ్‌లు మొరపెట్టుకున్నారని గుర్తుచేశారు. ‘చలో అసెంబ్లీ’కి వస్తే అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు.

బీఆర్‌ఎస్ పాలనలో పల్లెలు అద్భుతంగా మారాయని తెలిపారు. అందుకే కేంద్రం ప్రకటించిన మొదటి 20 ఉత్తమ పంచాయతీల్లో 19 తెలంగాణకు చెందినవే ఉన్నాయని స్పష్టంచేశారు. తెలంగాణ పల్లెలను కేసీఆర్ దేశానికి ఆదర్శంగా తయారుచేశారని చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది పాలనలో ఒక్క రూపాయి కూడా పంచాయతీలకు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వ హయాంలో పల్లె ప్రగతి కింద ప్రతి నెల రూ.275 కోట్లు, పట్టణ ప్రగతి కింద రూ.150 కోట్లు ఇచ్చామని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడాది కాలంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కింద ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు.

నవంబర్ ఒక్క నెలలో పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు రూ.1200 కోట్ల విడుదల చేసిన ప్రభుత్వం చిన్న వాళ్లపై కక్ష సాధింపు చర్యలు ఎందుకని ప్రశ్నించారు. సర్పంచులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని, అందుకు నిరసన తెలుపుతూ సభనుంచి వాకౌట్ చేస్తున్నామని హరీశ్‌రావు చెప్పారు. 

మీది బకాయిల రాష్ర్ట సమితి!

నాడు మీరు సంతకం చేస్తే పెండింగ్ ఉండేదా?: మంత్రి సీతక్క 

హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అంటేనే బకాయిల రాష్ట్ర సమితి అన్నట్టు పెండింగ్ బిల్లులు తమకు వారసత్వంగా ఇచ్చి పోయిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క విరుచుకుపడ్డారు. సర్పంచ్‌లకు చెల్లించాల్సిన బిల్లులను తప్పకుండా చెల్లిస్తామని స్పష్టంచేశారు.

మాజీ సర్పంచులలో అన్ని పార్టీలకు చెందిన వారు ఉన్నారని, వారి బాధలు తమకు తెలుసని చెప్పారు. కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి బిల్లులను చెల్లించేందుకు సానుకూలంగా ఉన్నామని ప్రకటించారు. ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తన్నీరు హరీశ్‌రావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, కోవా లక్ష్మి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ప్రశ్నలు అడిగారు.

ఎమ్మెల్యేల ప్రశ్నలపై మంత్రి సీతక్క సమాధానం చెప్పారు. ఈ క్రమంలో హరీశ్‌రావు విమర్శలకు సీతక్క అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఈ పెండింగ్ బిల్లులు గత ఏడాది కాలంగా కానీ, రెండేళ్ల కాలంగా కానీ లేవని, 2014 నుంచి ఉన్నాయని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్పంచ్‌లు లేరని వివరించారు.

అయినా, తాము కొన్ని బిల్లులు చెల్లించామని స్పష్టంచేశారు. గ్రామ పంచాయతీల కోసం రూ.740 కోట్లు, ఉపాధి హామీ కోసం రూ.450 కోట్లు చెల్లించామని చెప్పారు. ఎన్నికలు జరగకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని అన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా రావాల్సి ఉందని చెప్పారు.

బిల్లులను చెల్లించబోమని తాము అనడం లేదని, గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ఆర్థిక పరిస్థితి సరిగా లేదని, సర్దుబాటు చెల్లించేందుకు కొంత సమయం అడుగుతున్నామని సీతక్క పేర్కొన్నారు. ఇప్పుడు గ్రామాల్లో ఆమ్మ ఆదర్శ పాఠశాలలతో పనులు చేయిస్తున్నట్టు చెప్పారు. కులగణన వల్ల స్థానిక ఎన్నికల జరగకపోవడం వల్ల గ్రామాల్లో కొన్ని సమస్యలు ఉన్న మాట వాస్తమే అని మంత్రి పేర్కొన్నారు. 

మీరు నిధులిస్తే ఈ బకాయిలు ఉండేవే కాదు

సర్పంచుల ఆత్మహత్యలకు బీఆర్‌ఎస్ సమాధానం చెప్పాలి: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): మాజీ మంత్రి హరీశ్‌రావు చెప్పినట్టు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతి నెల రూ.275 కోట్లు విడుదల చేస్తే రాష్ట్రంలో సర్పంచులకు ఇప్పుడు బకాయిలు ఎందు కుంటాయని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. తాము 2023 డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చామని, ౨౦౨౪ ఫిబ్రవరిలో సర్పంచ్‌ల పదవీకాలం ముగిసిందని గుర్తుచేశారు.

బిల్లులు చెల్లించకపోవడంతో బీఆర్‌ఎస్ హయాంలో సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. దీనికి బీఆర్‌ఎస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వారి బకాయిలను తమ నెత్తిమీద పెట్టారని మంత్రి మండిపడ్డారు. వాటిని ఒకదాని తర్వాత ఒకటి చెల్లించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. సభను పక్కదారి పట్టించి, రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.