23-03-2025 12:00:00 AM
ప్రస్తుతం చాలామంది కెరీర్ కోసం, పిల్లల చదువుల కోసం సొంతూరిని వదిలి వేరే ఊళ్లకు వెళ్తుంటారు. అయితే తరచూ ఇలా ఇళ్లను మారడం పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
బాల్యంలో తరచూ ఊళ్లు మారుతోంటే పెద్దయ్యాక వాళ్లు కుంగుబాటు బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజాగా యూనివర్సిటీ ఆఫ్ ప్లుమైత్ చేసిన పరిశోధనలో వెల్లడైంది. వృత్తిరీత్యా అనేక ప్రాంతాలు మారాల్సి వచ్చే మిలిటరీ తల్లిదండ్రులు పిల్లల మీద అత్యంత శ్రద్ధ చూపించాలంటున్నారు పరిశోధకులు. నిజానికి మానసిక అనారోగ్యాలకు కారణాలు అనేకం ఉన్నప్పటికీ, పెరిగే వయసులో పదేపదే వాతావరణాన్ని మార్చడమూ ఒక కారణమవుతుందంటున్నారు పరిశోధకులు.
ఆటలు, రకరకాల యాక్టివిటీలతో అప్పుడప్పుడే స్కూల్లో తోటి విద్యార్థులతో స్నేహ బంధాలు ఏర్పరచుకోవడంతోపాటు చుట్టూ ఉండే వాతావరణానికీ అలవాటు పడుతుంటారు. ఇలాంటప్పుడు మనం తరచూ నివాస ప్రాంతాన్ని మారుస్తుంటే వాళ్ల ఎదుగుదలకు అంతరాయం కలుగుతుంటుంది. కాబట్టి పిల్లలకు చిన్నతనంలో స్థిరమైన బాల్యాన్ని అందించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు పరిశోధకులు.