తొలినాళ్లలో చిన్న చిన్న రోల్స్ చేసిన అచ్చ తెలుగు అందం చాందినీ చౌదరి. ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’, ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘బ్రహ్మోత్సవం’ వంటి ప్రేక్షకాదరణ పొందిన సినిమాల్లో చిన్న పాత్రలు పోషించింది. తర్వాత ‘కుందనపు బొమ్మ’లా ముస్తాబై హీరోయిన్‌గా మారింది. ‘కలర్ ఫొటో’లో మరింత అందంగా కనిపించి ప్రేక్షకుల మనసు దోచేసింది. తర్వాత వరుసగా అవకాశాలు వస్తున్నప్పటికీ ఆచితూచి ఎంచుకుంటూ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పదిలపర్చుకున్నదీ చిన్నది. తాజాగా ‘యేవమ్’లో పోలీస్‌గా తన నటనా పవర్ చూపి, ‘మ్యూజిక్ షాప్ మూర్తి’లో అల్లరి పిల్లగానూ సందడి చేసింది.
అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా చాందినీ అడవాళ్ల పట్ల చులకనగా చూసేవారి తీరుపై మండిపడింది. ‘నేను ఇండస్ట్రీలో చూసిన దాని ప్రకారం.. నిజాయితీగా మీ అందరినీ ఓ ప్రశ్న అడుగుతున్నా. మగవాళ్లు.. సినీ పరిశ్రమలో పనిచేసే ఆడవాళ్లను క్యారెక్టర్ లేనివాళ్లలా ఎందుకు చూస్తారు? కొందరు మాట్లాడేటప్పుడు ప్రతి మాటా.. ఆడవాళ్లను తక్కువ చేసే మాట్లాడతారు. అది మనసుకు ఎంతో బాధ కలిగిస్తుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి పని చేయాల్సి ఉంటుంది.
అలాంటప్పుడు ఇలాంటి మాటలు విని మనసు విరిగిపోతుంది’ అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చిందీ సొగసరి. చాందినికి ఇండస్ట్రీ బయట ఎదురైన ఓ చేదు అనుభవాన్ని ఉద్దేశించి ఇలా అసహనం వ్యక్తం చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తున్నది. ఇదిలా ఉండగా, చాందిని పోస్టుపై స్పందిస్తున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ‘చాలా మంది ఇలానే చూస్తారు. తప్పుగా కామెంట్స్ చేస్తారు. అంత సులువుగా కామెంట్స్ చేసేవారు అవతలివాళ్లు ఎంత బాధ పడతారనే విషయాన్ని ఆలోచించరు వరస్ట్ ఫెలోస్’ అంటూ ఘాటుగా కామెంట్స్ పెడుతున్నారు.