- ఇండియా డీ ముందు కొండంత లక్ష్యం..
- మొదటి ఇన్నింగ్స్‌లో చేతులెత్తేసిన శ్రేయస్ సేన
- పటిష్ట స్థితిలో బీ జట్టు
అనంతపురం: దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ మ్యాచ్‌లో ఇండియా డీ జట్టు ఎదురీదుతోంది. ఇండియా ఏ తో జరుగుతున్న మ్యాచ్‌లో విజయం కోసం ఇంకా 426 పరుగుల భారీ స్కోరు కావాలి. చేతిలో 9 వికెట్లు ఉన్నా కానీ ఆటగాళ్లు మొదటి ఇన్నింగ్స్ ఆడిన తీరు చూస్తే విజయఢంకా మోగిస్తారా అనేది ప్రతి ఒక్కరికీ సందేహమే. ఎంతో మంది స్టార్ ఆటగాళ్లు ఉన్నా కానీ మొదటి ఇన్నింగ్సులో కేవలం 183 పరుగులకే చాపచుట్టేశారు. మరి ఇండియా ఏ జట్టులో భీకరమైన ఫాస్ట్ బౌలర్లు ఉన్నారా అంటే లేరనే సమాధానమే వినిపిస్తోంది.
మొదటి ఇన్నింగ్సులో యువ ఆటగాడు పడిక్కల్ (92) ఒక్కడే పోరాడాడు. పడిక్కల్ కూడా లేకపోతే ఇండియా డీ జట్టుకి ఆ మాత్రం స్కోరు కూడా వచ్చేది కాదంటే అతిశయోక్తి కాదు. మొదటి ఇన్నింగ్సులో రెండొందల మార్కును కూడా చేరుకోని జట్టు రెండో ఇన్నింగ్సులో 400 పైచిలుకు పరుగులు చేసి విజయం సాధించడమంటే ఎవరికైనా సరే కాస్త కష్టంగానే అనిపిస్తుంది.
కానీ లైనప్ చూస్తే మాత్రం ఎంతో మంది క్వాలిటీ ఆటగాళ్లతో నిండి ఉంది. ఈ మ్యాచ్ మూడు రోజులు మాత్రమే పూర్తి కావడంతో ఇండియా డీ జట్టుకు విజయం సాధించడమో.. లేక ఏ జట్టు ముందు తలవం చడమో అనే ఆప్షన్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరి నేడు ఏం జరగనుందో చూడాలి. ఇండియా ఏ జట్టు బౌలర్లు ఎటువంటి ప్రదర్శన కనబరుస్తారో...
ధీటుగా బదులు
ఇక ఇండియా బీ ఇండియా సీ జట్ల మధ్య జరుగుతున్న మరో మ్యాచ్ మొదటి మ్యాచ్‌కు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇండియా సీ జట్టు 525 పరుగుల భారీ స్కోరు చేసింది. తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇండి యా బీ కూడా సీ జట్టుకు ధీటుగా బదులిస్తోంది. ప్రస్తుతం 7 వికెట్లు కోల్పోయి 309 పరుగుల వద్ద మూడో రోజు ఆటను ముగించింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఫలితం తేలుతుందా అని అందరిలో ఆసక్తి నెలకొంది.
ముందుండి నడిపిస్తున్న నాయకుడు
ఇండియా బీ జట్టు కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ 143* ముందుండి జట్టును నడిపిస్తున్నాడు. ఓపెనర్ జగదీశన్ (70) తప్ప తనకు ఎవరూ పెద్దగా సహకారం అందించకపోయినా కానీ అభిమన్యు మాత్రం తన పోరా టాన్ని కొనసాగిస్తున్నాడు. దీంతో ఇండియా బీ జట్టు మొదటి మూడు రోజుల ఆట ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 309 పరుగుల స్కోరు సాధించింది. రాహుల్ చహర్ 18*, ఈశ్వరన్ 143* క్రీజులో ఉన్నారు. అన్షుల్ కంబోంజ్ ఐదు వికెట్లు తీసి సత్తా చాటాడు. తొలి టెస్టుకు ఎంపికైన సర్ఫరాజ్ ఖాన్ 16 మాత్రమే చేసి నిరాశపర్చాడు.
అదరగొట్టిన తిలక్
తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ అదరగొట్టాడు. ఇండియా ఏ తరఫున ఆడుతున్న తిలక్ వర్మ రెండో ఇన్నింగ్స్‌లో 111* సెంచరీతో కదం తొక్కాడు. ఓపెనర్ ప్రథమ్ సింగ్ 122 సెంచరీ చేయగా.. తిలక్ కూడా శతకం బాదాడు. దీంతో ఇండియా ఏ రెండో ఇన్నింగ్సును 380 వద్ద డిక్లేర్ చేసింది.