calender_icon.png 22 September, 2024 | 2:55 AM

‘జమిలి’పై జనాలేమనుకుంటున్నారో తెలుసుకోరా..

22-09-2024 01:08:39 AM

జమిలి ఎన్నికల నిర్వహణ అంశాన్ని ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తు తం దేశమంతా ఈ విషయంపై తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఆయా పార్టీల నేతల మధ్య వాడీ వేడి మాటల యుద్ధం నడుస్తోంది. జమిలితో దేశ ఎన్నికల వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తామని చెప్తూ బీజేపీ పార్టీ వారి నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నది. కానీ జమిలి ఎన్నికల పేరుతో దేశంలో పెద్దకుట్రకు బీజేపీ తెర లేపుతుందని, వారి స్వార్థ ప్రయోజనం కోసమే జమిలి ఎన్నికల అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నారని ప్రతిపక్ష పార్టీలన్నీ తీవ్రంగా విమర్శిస్తున్నాయి. అయితే జమిలి ఎన్నికల నిర్వహణతో ఏ పార్టీకి లాభం చేకూరుతుందో..

ఏ పార్టీలకు నష్టం జరుగుతుందో విషయాన్ని పక్కనపెడితే... ‘జమిలి’తో జనాలకు జరగబోయే మంచి ఏంటో... ఇప్పుడు జరుగుతున్న నష్టమేంటో చెప్పాల్సిన అవసరం లేదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడున్నట్టు ఎన్నికలు నిర్వహించినా.. జమిలి తరహాలో ఎన్నికలు నిర్వహించినా ఓట్లు వేయాల్సింది జనాలే కదా. మరి అలాంటప్పుడు దేశ ఎన్నికల వ్యవస్థను మార్చే విధానపరమైన నిర్ణయం తీసుకోవడంలో జనాల అభిప్రాయం అవసరం లేదా అని జనాలే అనుకుంటున్నారు. ఓట్లు వేసేందుకు పనికొచ్చే జనాలు.. ఎన్నికల వ్యవస్థలో తీసుకునే నిర్ణయాల్లో మాత్రం జనాల అభిప్రాయానికి ప్రాధాన్యం ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు.