బీజేపీ ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఉండదా ?
అవకాశం ఇవ్వకపోవడం అప్రజాస్వామికం
బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): బడ్జెట్ ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో బీజేపీ సభ్యులు చర్చ పెట్టే అవకాశం ఇవ్వకపోవడం అప్రజాస్వామికమని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం అసెంబ్లీలో బిల్లు ఆమోదనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహిం చిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ సభ్యులు కావాలనే పొలిటికల్ డ్రామా నడిపారని ఆరోపించారు. అధికార పార్టీ స్కెచ్‌తోనే సభలో బీఆర్‌ఎస్ చర్చను పక్కదారి పట్టించిందని మండిపడ్డారు. ప్రతిపక్షాలు మాట్లాడకుండా ద్రవ్యవినిమయ బిల్లును ప్రవేశపెట్టడం చూస్తే ప్రజాస్వామ్యం గొంతు నొక్కడేమనన్నారు. చర్చ లేకుండా బిల్లును ప్రవేశపెట్టడాన్ని తాము ఖండిస్తున్నట్లు మహేశ్వర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో తమ పార్టీ ఎదుగుదలను చూసి అధికార పార్టీ కాంగ్రెస్‌కు భయం పట్టుకుందన్నారు. లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దీటుగా బీజేపీ ఎనిమిది ఎంపీ స్థానాలు సాధించడంతో హడలిపోతోందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రామారావ్ పవార్ ఉన్నారు.