గతంలోనే లబ్ధిదారుల ఎంపిక
ఇళ్ల కోసం ఎదురు చూపు
మంత్రి పొంగులేటిపైనే ఆశలు
కల్వకుర్తి (నాగర్‌కర్నూల్), అక్టోబర్ 6 (విజయక్రాంతి): దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా మారింది కల్వకుర్తి డబుల్ బెడ్రూం ఇళ్లపట్టాల పంపిణీ. గూడు లేని నిరుపేదలకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కల్వకుర్తి పట్టణంలోని బీఈడీ కళాశాల వెనకాల డబుల్ బెడ్రూం 240 ఇళ్లను నిర్మించి, లక్కీడిప్ ద్వారా లబ్ధిదారులను కూడా ఎంపిక చేసింది.
అనంతరం అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో లబ్ధిదారులకు అప్పగించడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు అలసత్వం చూపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇళ్లను అప్పగించడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
షెడ్డుల పరిస్థితీ ఇంతే..
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పురపాలక శాఖ ఆధ్వర్యంలో వీధి విక్రయదారుల కోసం ప్రధాన రహదారిపై షెడ్డులను నిర్మించింది. వాటిని కూడా లబ్ధిదారులకు అప్పగించలేదు. నిర్మాణం చేసి ఏళ్లు గడుస్తున్నా వాటి ని అప్పగించకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు నిలయమవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర హౌజింగ్, రెవెన్యూ శాఖ మంత్రి పొగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో లబ్ధిదారులు ఆశలు పెట్టుకున్నారు.