హైడ్రా కూల్చివేతలపై యథాతథ స్థితిని కొనసాగించాలని హైకో ర్టు స్పష్టం చేయడంతో కూల్చివేతలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది. మూసీ పరీవాహక ప్రాంతంలో పలు ఇళ్లకు రెడ్ మార్క్‌లు వేసిన అధికారులు వీటిని కూల్చివేయడానికి రేపో, మాపో సిద్ధమవుతారని ఆ ఇళ్ల యజమానులు ఆందోళన చెందుతూ వచ్చారు. దీనిపై పలువురు బాధితులు హైకోర్టును ఆశ్రయించారుకూడా.
అయితే అధికారులు చట్టప్రకారమే చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా ఒక వేళ ఇళ్లు కూల్చివేస్తే చట్టప్రకారం నష్టపరిహారం కోరే హక్కు బాధితులకు ఉందని కూడా న్యాయమూర్తి పేర్కొన్నారు. అంతేకాకుండా కూల్చివేతలపై సమగ్ర నివేదికలు సమర్పించాలంటూ హైడ్రాకు, రాష్ట్రప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడంతో హైడ్రా దూకుడుకు కాస్త బ్రేక్ పడినట్లయింది.
మరో వైపు ప్రతిపక్షాలు కూడా మూసీ పరీవాహక ప్రాంతం సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను కూల్చి వేయడంపై తమ ఆందోళనను ఉధృతం చేస్తూ ఉండడంతో బాధితులకు రాజకీయ అండ దొరికినట్లయింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిస్థితులను పూర్తిగా సమీక్షించి సమగ్రమైన ప్రణాళికతో ఈ కూల్చివేతలపై ముందుకు వెళితే బాగుంటుంది.
రాజశేఖర్, రాజేంద్రనగర్