calender_icon.png 11 October, 2024 | 4:07 AM

మాకు పదవులు ఎప్పుడో?

11-10-2024 01:19:49 AM

నామినేటెడ్ పోస్ట్‌ల కోసం నాయకుల ఎదురు చూపులు  

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు కష్టపడ్డాం 

అధికారంలోకి వచ్చి పది నెలలైనా పట్టించుకోవడం లేదు

బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెట్టడంపై అసంతృప్తి 

రెండో విడతలోనైనా గుర్తింపు దక్కుతుందా అని ఆందోళన 

బయోడేటాలతో నాయకుల చుట్టూ ఆశావహుల ప్రదక్షిణలు

హైదరాబాద్, అక్టోబర్ ౧౦ (విజయక్రాంతి): ఓ వైపు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తమ పరిస్థితి ఏంటని సొంత పార్టీ నాయకుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

అధికారంలోకి వచ్చి పది నెలలవు తున్నా ఇదిగో.. అదిగో అంటూ ఈ పండుగ, ఆ పండుగకు నామినేటెడ్ పదవులు ఇస్తామని ఊరించడమే తప్ప పూర్తిస్థాయిలో భర్తీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం  చేస్తున్నారు. మొదటి విడతలో ఒకేసారి 37 మందికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు. ఇటీవలే మూడు కమిషన్లతో పాటు రెండు కార్పొరేషన్ పదవులను కూడా భర్తీ చేశారు.

వీరిలో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డికి వ్యవసాయ సలహాదారుగా, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు గుత్తా అమిత్‌రెడ్డికి డైరీ డెవలప్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ పదవిని అప్పగించారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి అధికార బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం, ఉద్యమాలు చేయడంతో అనేక కేసుల్లో ఇరుక్కొని ఇప్పటికీ పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని కొందరూ కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పార్టీలో ఇటు చేరగానే ఆటు పదవులు తన్నుకుపోతున్నారనే బీఆర్‌ఎస్ నేతలపై పాత కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. 

సామాజిక న్యాయం ఎక్కడ..

ఇదిలా ఉండగా పదవుల పందెరంలో సామాజిక న్యాయం పాటించడం లేదని సొంత పార్టీ నుంచే తీవ్ర విమర్శలు  వినిపిస్తున్నాయి. ఒక సామాజిక వర్గానికి పార్టీలో చేరగానే పదవులు కట్టబెడుతున్నారని, మిగ తా వారు మొదటి నుంచి పార్టీలో పనిచేస్తు న్నా మొండి చెయ్యి చూపిస్తున్నారని ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు.

పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు .. పార్టీకి సేవలు ఉపయోగించుకున్న నాయకులు అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని కాంగ్రెస్‌కు చెందిన ఒక యువనేత ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన వారికి కూడా అధికారంలోకి వచ్చాక సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఇప్పుడు వారు కూడా నామినేటెడ్ పదవులు ఎప్పుడు వస్తాయా అని ఎదరు చూస్తున్నారు. ‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భుజాల మీద చేయి వేసి పార్టీ కోసం కష్టపడండి.. అధికారంలోకి వచ్చాక మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పారు. ఇప్పుడు బయోడేటాలను పట్టుకుని మంత్రులు, కొం దరు పార్టీ  నాయకులు చుట్టు తిరుగుతుం టే.. తమను చూసీ చూడనట్లుగా వ్యవహారిస్తున్నారు. 

ప్రతి రోజు మంత్రుల ఇంటికి వద్దకు వెళ్లి దండాలు పెట్టుకున్నా కనికరించడం లేదు’ అని పార్టీకి చెందిన మరొక యువనాయకుడు వాపోయారు. మొదటి విడతలో ఇచ్చిన నామినేటెడ్ పదవుల్లోనూ సామాజిక న్యాయం జరగలేదని, ఎస్సీ, బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదనతో ఉన్నారు. ఇక రెండో విడత పదవుల పంపకం కోసం ఎదురు చూస్తున్నామని ఆశావహులు చెబుతున్నారు.