క్రీడా యవనికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడిస్తున్న భారత్ 2036 ఒలింపిక్స్ నిర్వహణకు ఆసక్తి కనబరుస్తున్నది. దీనికి మరింత ఊతం లభించాలంటే మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న పారిస్ ఒలింపిక్స్‌లో మన అథ్లెట్లు మెరుగైన ప్రదర్శన చేయాలి. క్రీడా జగత్తులో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు చెప్పుకోదగ్గ రికార్డేం లేదు. ఇప్పటి వరకు 25 విశ్వక్రీడల్లో పాల్గొన్న భారత అథ్లెట్లు 35 పతకాలు.. 10 స్వర్ణాలు, 9 రజతాలు, 16 కాంస్యాలు సాధించారు. ఇందులో అత్యధికంగా పురుషుల హాకీలో 8 స్వర్ణాలుసహా 12 పతకాలు దక్కగా రెజ్లింగ్‌లో 7 మెడల్స్ వచ్చాయి. ఇక మిగిలిన క్రీడల్లో మన అథ్లెట్లకు అధిక శాతం రిక్తహస్తాలే మిగిలాయి.
అయితే, గత కొంతకాలంగా క్రీడా జగత్తులో భారత అథ్లెట్ల హవా పెరిగింది. ఆట ఏదైనా బరిలోకి దిగితే చివరి వరకు పోరాడుతూ అంతర్జాతీయ స్థాయిలో నిలకడ కొనసాగిస్తున్నారు. ఇప్పుడదే పోరాటతత్వం అభిమానుల్లో ఆశలు రేపుతున్నది. కొవిడ్ ప్రభావంతో ఏడాది ఆలస్యంగా జరిగిన టోక్యో (2020) ఒలింపిక్స్‌లో భారత్ అదరగొట్టింది. అథ్లెటిక్స్‌లో తొలి స్వర్ణం సహా మొత్తం 7 పతకాలు సాధించి విశ్వక్రీడల చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసుకుంది. ఇప్పుడదే స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈసారి పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. వారిలో అత్యధికంగా ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో 29 మంది ఉండగా, షూటింగ్‌లో 21 మంది, హాకీలో 19 మంది, టేబుల్ టెన్నిస్‌లో 8 మంది, బ్యాడ్మింటన్‌లో ఏడుగురు, రెజ్లింగ్, ఆర్చరీ, బాక్సింగ్‌లో ఆరుగురు, గోల్ఫ్‌లో నలుగురు, టెన్నిస్‌లో ముగ్గురు, స్విమ్మింగ్, సెయిలింగ్‌లో ఇద్దరు పోటీ పడుతున్నారు. వీటితోపాటు ఈక్వెస్ట్రియాన్, జూడో, రోయింగ్, వెయిట్ లిఫ్టింగ్ విభాగాల్లో భారత్ నుంచి ఒక్కో అథ్లెట్ బరిలోకి దిగనున్నారు.
పారిస్ ఒలింపిక్స్‌కు ఎంపికైన అథ్లెట్లతో ప్రత్యేకంగా సమావేశమైన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వారిలో స్ఫూర్తిని నింపారు. ఒత్తిడిని దరిచేరనివ్వకుండా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడంపైనే దృష్టి పెట్టాలని సూచించారు. దీంతోపాటు ఒలింపిక్స్ నిర్వహణ తీరుతెన్నులపై ఓ కన్నేయాలనీ సూచించారు. 2036లో విశ్వక్రీడలు నిర్వహించాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నది. ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ రెండంకెల సంఖ్యలో పతకాలు సాధిస్తే మన దేశంలో విశ్వక్రీడలు నిర్వహించాలనే డిమాండ్ మరింత పెరగడం ఖాయమే! గత ఒలింపిక్స్‌లో పసిడి పతకంతో చరిత్ర తిరగరాసిన గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రాపై మరోసారి భారీ అంచనాలు ఉన్నాయి.
ఇటీవలి కాలంలో అతడి నిలకడైన ప్రదర్శనే అందుకు కారణం. ఇక, మహిళల విభాగంలో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన ఏకైక షట్లర్ పీవీ సింధుపైనా అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. గత ఒలింపిక్స్‌లో రజతం సాధించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, కాంస్యం నెగ్గిన బాక్సర్ లవ్లీనా బొర్గోహై ఈసారి కూడా పోటీలో ఉండగా, వివిధ క్రీడాంశాల్లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్లు భారత్ తరఫున బరిలోకి దిగనున్నారు. ఇందులో ముఖ్యంగా తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ 50 కేజీల విభాగంలో పతకంపై ఆశలు పెంచుతున్నది. అంతర్జాతీయ స్థాయిలో బరిలోకి దిగిన ప్రతి టోర్నీలో ప్రత్యర్థికి కనీసం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోతున్న నిఖత్ అదే జోరు కొనసాగిస్తే తెలంగాణ సిగలో మరో కలికితురాయి చేరనుంది. హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్, మనూబాకర్, బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి, రెజ్లర్లు అంతిమ్ పంగల్ 53 కేజీల విభాగంలో, వినేశ్ ఫొగాట్ 50 కేజీల విభాగంలో పతక ఆశలు రేపుతుండగా, నాలుగు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన భారత పురుషుల హాకీ జట్టు పారిస్‌లోనూ అదే జోరు కొనసాగించి పోడియంపై నిలవాలని ఆశిద్దాం!