ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా కేసులు, కుంభకోణాలు, అరెస్టులు, పొలిటికల్ బాంబులు పేల్చడం తప్పా వేరే మాటే వినపడట్లేదు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ నాయకులు రాష్ట్రాన్ని దోచుకున్నారని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని అధికార కాంగ్రెస్ విమర్శిస్తున్నది. అరెస్టు చేస్తే చేసుకోండని బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండు రహస్య స్నేహితులని బీజేపీ ఆరోపిస్తున్నది.
రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ ఎవరికి వారు ఇలా రాజకీయాలు చేసుకోవడం తప్పా ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లు సరిగ్గా జరగక కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు, సంక్షేమ పథకాల విషయంలో ప్రజలు, గురుకుల వసతుల లేమితో విద్యార్థులు.. ఇలా అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే పరిష్కారం చూపాల్సింది పోయి రాజకీయాలకు వాడుకుంటున్నారని వాపోతున్నారు.