ప్రముఖ విప్లవ సినిమాల దర్శక నిర్మాత, నటుడు ఆర్.నారాయణమూర్తి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. రెండు నెలల క్రితం బైపాస్ చేయించుకున్న ఆయన తాజాగా బుధవారం ప్రసాద్ ల్యాబ్స్‌లో ఉండగా నీరసంగా అనిపించటంతో నేరుగా పంజాగుట్ట నిమ్స్‌కు వెళ్లారు. డాక్టర్ బీరప్ప ఆధ్వర్యంలో వైద్యపరీక్షలు జరిగాయి. చికిత్సతో క్రమంగా కోలుకుంటున్నారని కూడా వైద్యులు వెల్లడించారు. అయితే, ఆయన ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పలువురు సినీ ప్రముఖులు సైతం ఆయన ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. దీంతో స్వయంగా నారాయణమూర్తే స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, అభిమానులు ఆందోళన చెందవద్దని ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.