calender_icon.png 15 January, 2025 | 10:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రుణమాఫీపై ఆందోళన వద్దు !

25-08-2024 02:53:07 AM

  1. పథకం వర్తించని వారు తిరిగి దరఖాస్తు చేసుకోండి 
  2. రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

సూర్యాపేట, ఆగస్టు 24 (విజయక్రాంతి): రుణమాఫీపై ఆందోళన చెందొద్దని, మాఫీ వర్తించని వారు తిరిగి వ్యవసాయశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం చౌటపల్లిలోని వేణుగోపాలస్వామి ఆలయ ఆవరణలో రూ.50 లక్షలతో నిర్మిస్తున్న రాజగోపురానికి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. తర్వాత రఘునాథపాలెంలో పీఏసీఎస్ గోడౌన్‌ను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. 

హుజూర్‌నగర్ నియోజకవర్గ  అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నానన్నారు. దీనిలో భాగంగానే మఠంపల్లి నుంచి మట్టపల్లి రోడ్డును విస్తరిస్తున్నామని స్పష్టం చేశారు. చౌటపల్లిలో ఇండ్లులేని పేదలకు ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. చౌటపల్లిలో లిఫ్ట్ ఏర్పాటు చేసి సాగునీటి ఇబ్బందులు తొలగించాలని రైతులు మంత్రిని కోరగా.. ఆయన అధికారులతో మాట్లాడి తగు నిర్ణయం తీసుకుంటామని సమాధానమిచ్చారు. కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు శివారెడ్డి, మంజీనాయక్ పాల్గొన్నారు.