న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ఫామ్‌పై ఆందోళన అవసరం లేదని దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. కొంచెం ఓపిక ప్రదర్శిస్తే చాలు.. కోహ్లీ నుంచి అద్భుత ఇన్నింగ్స్‌లు వస్తాయని వ్యాఖ్యానించాడు. టీ20 ప్రపంచకప్‌లో వరుసగా విఫలమవుతున్న కోహ్లీపై విమర్శలు వచ్చిన వేళ సన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ కోహ్లీకి వరుస వైఫల్యాలు కొత్తేం కాదు. గతంలోనూ విఫలమైన సందర్భాల నుంచి బయటపడిన కోహ్లీ చాలా మ్యాచ్‌ల్లో భారత్‌కు విజయాలు అందించాడు.
ఈ విషయం అతడికి గుర్తుండే ఉంటుంది. ప్రపంచకప్‌లో ఇప్పుడు మనం తొలి దశలోనే ఉన్నాం. ఇంకా సూపర్ సెమీస్, ఫైనల్ మిగిలే ఉన్నాయి. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమైనంత మాత్రానా కోహ్లీ ఫామ్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాస్త ఓపిక ప్రదర్శిస్తే తప్పకుండా మంచి ఇన్నింగ్స్‌లు ఆడతాడు. మ్యాచ్‌లో కొన్నిసార్లు బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తారు. మంచి బంతులు ఎదుర్కొనే క్రమంలో బ్యాటర్లు పెవిలియన్ చేరుతుంటారు. కోహ్లీ ఆటపై మనకు నమ్మకం ఉంది. ఇలాంటి పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలన్నది అతడికి బాగా తెలుసు. రానున్న మ్యాచ్‌ల్లో కోహ్లీ టీమిండియాకు కీలకం కానున్నాడు’ అని గవాస్కర్ అన్నాడు.