calender_icon.png 25 March, 2025 | 7:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటిని వృథా చేయొద్దు..

22-03-2025 11:34:48 PM

జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి..

పొదుపుగా వాడుకుంటే భవిష్యత్తు..

అవసరాలకు మించి జలవనరులను వినియోగించడంతో ఇబ్బందులు 

హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): నీటిని వృథా చేయొద్దని, పొదుపుగా వాడుకుంటేనే భవిష్యత్తు అని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి అన్నారు. వెంగళ్ రావు నగర్ లోని దుర్గాబాయ్ దేశ్ ముఖ్ బాలికల పాలిటెక్నిక్ కళాశాలలో జలమండలి ఆధ్వర్యంలో ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎండీ అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ... అవసరాలకు మించి జలవనరులను వినియోగించడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ప్రతి వాననీటి బొట్టును ఒడిసిపట్టి, భవిష్యత్తు తరాలకు అందించాలని సూచించారు.

ప్రపంచంలో జీవకోటికి ఆక్సిజన్ తర్వాత అంతటి విలువైంది నీరు మాత్రమే అని చెప్పారు. 1కోటీ 30 లక్షలు జనాభా ఉన్న హైదరాబాద్ కు రోజూ తాగునీరు సరఫరా చేయడం పెద్ద సవాలుతో కూడుకున్న పని అన్నారు. పెద్ద పంపులు, భారీ పైపుల ద్వారా నగర పౌరులకు జలమండలి నీటి సరఫరా చేస్తోందని తెలిపారు. హైదరాబాద్ నగరంలో తగినంత స్థాయిలో భూగర్భ జలాలు లేకపోవడం వల్లే, 150 కిలోమీటర్ల నుంచి తాగునీరు సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. ఇక్కడ భూగర్భ జలాలు సరిపడా ఉంటే అంత శ్రమ పడే అవసరం లేదని చెప్పారు. నగరంలో తాగునీటికి డిమాండ్ ఏర్పడిందన్నారు. అవసరానికి మించి నీటిని వినియోగించడమే దానికి కారణమన్నారు.

13 లక్షల కనెక్షన్లలో కేవలం 42 వేల గృహాలే ట్యాంకర్ బుక్ చేసుకుంటున్నారని తెలిపారు. జల సంరక్షణ, నీటి పొదుపు అంశాలపై నేటి నుంచి 10 రోజుల పాటు జలమండలి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఈఎన్సీ, డైరెక్టర్ ఆపరేషన్స్-2 వీఎల్ ప్రవీణ్ కుమార్, ఆపరేషన్స్-1 డైరెక్టర్ అమరేందర్ రెడ్డి, సీజీఎం ప్రభు, జీఎం హరిశంకర్, ఇంకుడు గుంతల నిర్మాణ ప్రత్యేక అధికారి జాల సత్యనారాయణ, గాంధీగ్యాన్ ప్రతిష్ఠాణ్ (ఎన్జీవో) ఛైర్మన్ రాజేందర్ రెడ్డి, వైస్ ఛైర్మన్ యానాల ప్రభాకర్ రెడ్డి, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ నాగరాజు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.