calender_icon.png 24 January, 2025 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జప్తు చేసిన ఆస్తుల క్రయవిక్రయాలు చేయొద్దు

22-10-2024 01:35:16 AM

రైస్ మిల్లర్ల వివాదంపై హైకోర్టు

హైదరాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): ప్రభుత్వ జప్తు నుంచి విడుదల చేసిన ఆస్తుల క్రయవిక్రయాలు చేయరాదని రైస్ మిల్లర్లను హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టంచేసింది. అడ్వొకేట్ జనరల్ అభ్యర్థన మేరకు తదుపరి విచారణ నవంబర్ 5కు వాయిదా వేసింది.

తెలంగాణ రెవెన్యూ రికవరీ చట్టం 1864 ప్రకారం చర్యలు చేపట్టడంతోపాటు తమ ఆస్తులను జప్తు చేయడాన్ని సవాల్ చేస్తూ నల్లగొండ జిల్లా హాలియాకు చెందని చీదెళ్ల కేశవరావు సహా పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆస్తి బహిరంగ విక్రయానికి మే 27న ఉత్తర్వులు జారీ చేయడం చట్టవిరుద్ధమని.. ఈ ఉత్తర్వులను నిలిపివేయాలని కోరారు.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. నిర్ణీత సమయానికి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ఇవ్వలేదని రైస్ మిల్లర్ల భూములు, ఆస్తులను స్వాధీనం చేసుకోవడంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు పౌరసరఫరాల శాఖ అధికారు లు, సూర్యాపేట జిల్లా కలెక్టర్లపై హైకోర్టు ఆగ్ర హం వ్యక్తంచేశారు.

స్వాధీనం చేసుకున్న ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చడం, రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం స్వాధీనం చేసుకున్న భూములను విక్రయించడానికి ప్రయత్నించడం వంటి చర్యలను రద్దు చేశారు. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది.

ఈ అప్పీల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాస్రావు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున ఏజీ ఏ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘మిల్లర్లకు ఇచ్చిన ధాన్యానికి తిరిగి ఇచ్చే బియ్యానికి సంబంధించి ఎలాంటి వివాదం లేదు. రికవరీ కోసం చర్య తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది.

దీని కోసం ప్రతివాదులు ఎటువంటి నోటీసులకు ఇవ్వాల్సిన అవసరం లేదు. తగినంత సమయం ఇచ్చిన తర్వాతే చర్యలు చేపట్టాం’ అని చెప్పారు. మిల్లర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ‘2022-2023' రబీ సీజన్లో కుండపోత వర్షాల కారణంగా వరి పంట తీవ్రంగా దెబ్బతిన్నది. మిల్లింగ్ సామర్థ్యం కంటే ఎక్కువ ధాన్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేసింది.

కస్టమ్ మిల్లింగ్, రవాణా సేవల కోసం ప్రభుత్వం ఎలాంటి చెల్లింపులు చేయలేదు. దీంతో సీఎంఆర్ పంపిణీలో జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ తెలంగాణ రెవెన్యూ రికవరీ చట్టం1864 ప్రకారం రికవరీ చర్యలను ప్రారంభించింది.

సింగిల్ జడ్జి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తీర్పునిచ్చారు’ అని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఏజీ విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది.