వనపర్తి (విజయక్రాంతి): రోడ్లపై ధాన్యాన్ని పోసి నల్ల కవర్ కప్పడం వల్ల ధాన్యం కుప్పలు కనపడక ధాన్యము కుప్పకు ఢీకొని చనిపోయిన సంఘటనలు చాలానే ఉన్నాయి. వనపర్తి జిల్లాలో జరిగే రోడ్డు ప్రమాదాల నివారనకై రోడ్లపై ధాన్యాన్ని పోయవద్దని, ప్రమాదాలకు కారణం కావద్దని రైతులను జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ గురువారం ఒక ప్రకటన ద్వారా కోరారు. రోడ్లపై ధాన్యం పోసి కల్లాలుగా మార్చడం వల్ల వాహనదారులు రాత్రి సమయాలలో గమనించక ప్రమాదాలు జరిగి చనిపోతున్నారని, బావుల దగ్గర ఇండ్ల వద్ద లేదా సొంత పొలాల్లో ఇతర ప్రదేశాలలో ధాన్యం పోయడానికి ప్రత్యేకంగా కళ్ళాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. నిర్లక్ష్యంగా రోడ్లపై ధాన్యం పోసి వాహనదారులకు ఇబ్బంది కలిగించి అమాయక ప్రజల ప్రాణాలు పోవడానికి కారణం కావొద్దనన్నారు. రోడ్లపై ధాన్యం పోయవద్దని పోలీస్ అధికారులు సిబ్బంది కూడా రైతులకు విధిగా అవగాహన కల్పించాలని సూచించారు. ఎవరైనా ధాన్యాన్ని రోడ్లపై నిర్లక్ష్యంగా పోస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.