- తెల్ల చిట్టీలపై డాక్టర్ల ప్రిస్క్రిప్షన్
- బయట తెచ్చుకోమని ఉచిత సలహాలు
- పిరమవుతున్న ప్రభుత్వ వైద్యం
మంచిర్యాల, జూలై 30 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలకు రోగుల తాకిడి రోజూ ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడికి వచ్చే వారిలో 90 శాతం రోగులు పేదవారే. కానీ ఆసుపత్రిలో మందుల కొరతతో వారి జేబులకు చిల్లులు పడుతున్నాయి. ప్రైవేటులో చూపించుకునేందుకు డబ్బులు లేక సర్కారు దవాఖానకొస్తే మందులు లేవని చెబుతూ బయటకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బయటి నుంచే మందులు తెచ్చుకోవాలి
మంచిర్యాల ప్రభుత్వాసుపత్రి వైద్యులు రోగులకు తెల్ల చిట్టీలపై మందులు రాసి, బయట తెచ్చుకోవాలని పంపుతున్నారు. తిండి ఖర్చుల కోసం తెచ్చుకున్న డబ్బులు మందుల కోసం ఖర్చు చేస్తూ, పస్తులుంటున్నామని కొందరు రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రిస్కిప్షన్‌ను వైద్యులే రాసి పంపుతున్నారా, వార్డు నర్సింగ్ ఆఫీసర్ రాసిస్తున్నారా, మరెవరైనా సిబ్బంది ఇస్తున్నారో కూడా తెలియడం లేదని చెపుతున్నారు.
ఆసుపత్రిలో మందులివ్వలేదు
నడుం నొప్పి లేవడంతో సిరోంచా నుంచి మంచిర్యాలకు ఆసుపత్రికి వచ్చి న. డాక్టర్ నన్ను పరీక్షించి, మందుగోలీల చిట్టీ రాసిచ్చిం డు. ఆసుపత్రిలోని మందుల షాపుకెళ్లే అక్కడ లేవని, బయట కొనుక్కోమని చెప్పిండ్రు. చేసేదిలేక బయటే డబ్బు లు చెల్లించి మందులు కొనుక్కున్నా.
సుదిష్టని రామసీతు జోడె, సిరోంచా, మహారాష్ట్ర
చిట్టీపై రాసి తెచ్చుకోమన్నరు
నా భార్యకు జ్వరం రావడంతో ఆసుపత్రిలో చేర్పించాను. ప్లేట్‌లేట్లు తక్కువగా ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. ఆసుపత్రిలో చేర్పించుకోవడంతో అన్ని వాళ్లే ఇస్తరనుకున్న. కానీ చిట్టీపైన రాసి, మందులు తెచ్చుకోమన్నరు. బయట ప్రైవేటు షాసులో డబ్బులు పెట్టి మందులు కొని తీసుకెళ్లిన.
గుండ విజయ్ కుమార్, బుగ్గ గూడెం, కాసిపేట
కొనుగోలు చేసి ఇస్తున్నం
జిల్లా ఆసుపత్రికి ఆదిలాబాద్ నుంచి మందులు రావాలి. అత్యవసర సమయంలో అందుబాటులో లేకుంటే మేమే కొనుగోలు చేసి రోగులకు ఇస్తున్నం. కొన్ని సందర్భాల్లో రోగి బంధువులే అడిగి మరి రాయించుకుని, బయట తెచ్చుకుంటున్నారు. ఆసుపత్రిలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుతున్నాం. బయటకు వెళ్లి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు.
హరిశ్చంద్రరెడ్డి, సూపరింటెండెంట్, ప్రభుత్వాసుపత్రి, మంచిర్యాల
వార్డుల్లోనే రోగుల బెడ్లు
మంచిర్యాల జిల్లా ఆసుపత్రిలో మందుల విషయం అలా ఉండగా.. ఇన్‌పేషంట్లతో ఆసుపత్రి నిండిపోతున్నది. ఆసుపత్రి గ్రౌండ్ ఫ్లోర్‌లో బెడ్‌లు, గదులు ఖాళీగా ఉన్నా రోగులకు కేటాయించకుండా అందరిని మొదటి అంతస్తుకే తరలిస్తున్నారు. దీంతో గదులు సరిపోకా, వరండాలో బెడ్‌లు వేసి రోగులకు చికిత్స అందిస్తున్నారు. వరండాలో ఫ్యాన్లు లేక దోమలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా తాగునీరు, మరుగుదొడ్ల వసతి లేకపోవడంతో రోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.