calender_icon.png 5 November, 2024 | 10:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షిఫ్టింగ్ పద్ధతుల్లో కళాశాల చదువులు మాకొద్దు..

04-11-2024 04:19:50 PM

కౌడిపల్లిలో రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహతో మొరపెట్టుకున్న కళాశాల విద్యార్థులు 

కౌడిపల్లి (విజయక్రాంతి): షిఫ్టింగ్ పద్ధతుల్లో కళాశాల చదువులు మాకొద్దు అంటూ కౌడిపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. నర్సాపూర్ నుంచి మెదక్ వైపు వెళ్తున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కాన్వాయ్ కౌడిపల్లికి వచ్చేసరికి వందలాది మంది విద్యార్థులు నేషనల్ హైవే పైకి వచ్చి మంత్రికి వినబడేలా నినాదాలు చేశారు. దీంతో కాన్వాయ్ ని ఆపి కారు దిగి మంత్రి విద్యార్థుల వద్దకే వెళ్లారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కౌడిపల్లికి డిగ్రీ కళాశాల మంజూరైన విషయం మంచిదే సార్... కాగా మా జూనియర్ కళాశాలలోనే ప్రస్తుతానికి 343 మంది విద్యార్థులు ఇప్పటికే తరగతి గదుల కొరతతో ఇబ్బందులు పడుతూ చదువుకుంటున్నాం. మళ్లీ డిగ్రీ కళాశాలను సైతం మా కళాశాలలో నడిపిస్తారంటా... డిగ్రీ కళాశాల నడిపిస్తే షిఫ్టింగ్ పద్ధతుల్లో నడిపించాల్సి వస్తుంది. షిఫ్టింగ్ పద్ధతుల్లో కళాశాలలు నిర్వహిస్తే అటు డిగ్రీ ఏమో కానీ ఇటు మా చదువులకు మాత్రం ఆటంకం జరుగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కావున దయచేసి డిగ్రీ కళాశాలను వేరొక చోటకు మార్చాలంటూ మంత్రికి విద్యార్థులు మొరపెట్టుకుని మెమొరాండాలని అందజేశారు. డిగ్రీ కళాశాల నిర్వహించేందుకు మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సార్ బిల్డింగ్ ఉచితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ మమ్మల్ని ఇబ్బందికి గురి చేయడం ఏమిటని విద్యార్థులు ప్రశ్నించారు.

మమ్మల్ని ఇబ్బంది పెట్టడంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ దామోదర్ సార్ పాత్ర ఉందని విద్యార్థులు మంత్రితో మొరపెట్టుకున్నారు. విద్యార్థులతో ముచ్చటించిన మంత్రి ఆందోళన చెందాల్సిన పనిలేదని మీ కళాశాల భవనంలోనే జూనియర్ కళాశాల విద్యార్థులు మాత్రమే చదువుకుంటారని.. అనవసరంగా ఆందోళన చెందాల్సిన పనిలేదని వారికి సర్దిజెప్పారు. దీంతో విద్యార్థులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వెంకటసుబ్బయ్య, కళాశాల సిబ్బంది సురేందర్ రెడ్డి, దుర్గయ్యలతో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.