calender_icon.png 26 February, 2025 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోదీజీ భాషల మధ్య మంటలు రాజేయొద్దు

25-02-2025 11:38:57 PM

అవసరమైతే మేం భాషా ఉద్యమానికి సిద్ధం..

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్..

చెన్నై: ప్రధాని మోదీ భాషల మధ్య మంటలు రాజేయద్దు. దేశంలో ఎప్పుడూ భాషల మధ్య వైరం లేదు. నూతన విద్యావిధానంలో భాగంగా హిందీని మాపై రుద్దొద్దు. భాషలను రాజకీయ కోణంలో చూడొద్దు. అవసరమైతే మేం మరో భాషా ఉద్యమానికి సిద్ధం’ అని తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటించారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించేందుకు మార్చి 5న అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటించారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన దక్షిణాది రాష్ట్రాలపై వేలాడుతున్న కత్తి అని వ్యాఖ్యానించారు.

చెన్నైలో మంగళవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. జనాభాను నియంత్రించడం భారత్ ఎదుట ఉన్న అతిపెద్ద సవాల్ అని, ఈ అంశంలో ఇప్పటికే తమిళనాడు విజయం సాధించిందన్నారు. తక్కువ జనాభా కారణంగా పార్లమెంట్ సీట్లు తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఒకవేళ సీట్లు తగ్గాల్సి వస్తే తమిళనాడులో ఎంపీ సీట్ల సంఖ్య 39 నుంచి 31కు పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపివేసిందని, తమ రాష్ట్రం పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం తగదన్నారు.