- ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి
- రేవ్ పార్టీలో పట్టుబడిన వారికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 26 (విజయక్రాంతి): రేవ్ పార్టీ వంటి కార్యక్రమా ల్లో పాల్గొని యువత బంగారు భవిష్యత్తును బలి చేసుకోవద్దని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి అన్నారు. విద్యార్థులు రేవ్ పార్టీల్లో మద్యం, డ్రగ్స్, ఇతర కార్యకలాపాలకు పాల్పడుతుంటే భావితరాల భవిష్యత్తు ఏమైపోతుంద నే భయం వేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మాదాపూర్‌లోని క్లౌడ్ అపార్ట్‌మెంట్‌లో నిర్వహిం చిన రేవ్ పార్టీలో 20 మందికి పైగా పట్టుబడిన విషయం తెలిసిందే. ఐదుగురిపై కేసు నమోదు చేసి వారిని జైలుకు పంపించిన అధికారులు మిగిలిన యువతీ యువకులకు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ సమక్షంలో శుక్రవారం ఆబ్కారీ భవన్‌లో కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఎనిమిది మంది యువతీ యువకులకు కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆడ, మగ తేడా లేకుండా గంజాయి, డ్రగ్స్, మద్యం సేవించడం, పబ్బులకు, రేవ్ పార్టీలకు వెళ్లడం వంటి వాటి ద్వారా ఏం సాధించాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. మారడానికి ఒక అవకాశం ఇవ్వాలని భావించి కౌన్సిలింగ్‌కు పిలిచామని, లేదంటే అరెస్టు చేసి జైలుకు తరలించాల్సి ఉండేదని హెచ్చరించారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి, ఈఎస్‌ఎస్‌టీఎఫ్ టీమ్ లీడర్ ప్రదీప్‌రావు, సిబ్బంది సమక్షంలో జరిగిన కౌన్సిలింగ్‌కు రేవ్ పార్టీ బాధితులు, వారి కుటుంబసభ్యులు హాజరయ్యారు.