హైకోర్టులో కదిరె కృష్ణయ్య పిటిషన్
హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): ఒక సమావేశంలో రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ ఇప్పటికే రెండు కేసులు నమోదయ్యాయని, అదే ఆరోపణపై పలు కేసులు నమోదు చేయకుండా పోలీసులకు ఆదేశాలు జారీచేయాలంటూ లాయర్ కదిరె కృష్ణయ్య హైకోర్టును ఆశ్రయంచారు. దీనిపై జస్టిస్ బీ విజయసేనారెడ్డి విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ వెంకటేశ్వరస్వామి సుప్రభాతంపై ఒక మతాన్ని కించపరచేలా ఒక సమావేశంలో రెచ్చగొట్టేలా మాట్లాడారన్న ఆరోపణలపై జూబ్లీహిల్స్, ఎల్బీనగర్ పోలీసు స్టేషన్లలో కృష్ణయ్యపై కేసులు నమోదు చేశారని అన్నారు.
పిటిషనర్ ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని, రక్షణ కల్పించేలా పోలీసులకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇదే ఆరోపణపై తాజాగా కేసులను నమోదు చేయకుండా సంబంధిత పోలీసు కమిషనరేట్లకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తిచేశారు. వాదనలను విన్న న్యాయమూర్తి పోలీసుల వివరణ కోరుతూ విచారణను ఈ నెల 12కి వాయిదా వేశారు. ఒక మతం వ్యవహారాలు నచ్చకపోతే వదిలేయాలని, వ్యాఖ్యలు చేయడం ఎందుకని న్యాయమూర్తి పిటిషనర్‌ను ప్రశ్నించారు.