calender_icon.png 20 October, 2024 | 6:54 AM

ధిక్కార శిక్షకు సిద్ధంకండి

20-10-2024 01:38:22 AM

  1. ఇంజినీరింగ్ సీట్ల కేసులో ప్రభుత్వానికి హైకోర్టు హెచ్చరిక
  2. గత ఆదేశాలు అమలు చేయకపోవటంపై ఆగ్రహం

హైదరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): ఇంజినీరింగ్ సీట్ల పెంపు వివాదంలో కాలేజీల పిటిషన్లపై తాము గతంలో జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేస్తారో లేదో చెప్పాలని, ఒకవేళ అమలు చేయకపోతే కోర్టు ధిక్కరణ విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించింది.

ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఏఐసీటీఈ, జేఎన్టీయూ ఆమోదించిన సీట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతించాలని, సీట్ల భర్తీకి మాప్ అప్ కౌన్సిలింగ్ జరపాలని గత నెల 9న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని అమలు చేయలేదంటూ దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాదే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం ఇటీవల విచారించింది.

గత నెల 9న ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేసి తీరాల్సిందేనని నొక్కి చెప్పింది. గత ఉత్తర్వులను అమలుచేసినట్లు నివేదిక సమర్పించాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. కాలేజీలు వేసిన కోర్టు ధిక్కరణ పిటిషనల్లో కౌంటర్ దాఖలుకు రెండువారాల గడువు కావాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్ రాహుల్ రెడ్డి కోరటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయకూడదనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అనిపిస్తోందని అసహనం వ్యక్తంచేసింది. కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోతే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాలో ప్రభుత్వానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని హెచ్చరించింది. ఆదేశాల అమలుపై సోమవారం జరిగే విచారణలో స్పష్టంగా చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.