calender_icon.png 8 January, 2025 | 7:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీని రాజకీయం చేయొద్దు

11-07-2024 12:49:23 AM

  1. విభజన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి
  2. పది ఎకరాల వరకు రైతుభరోసా ఇవ్వడం మంచిది
  3. మీడియాతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి

నల్లగొండ, జూలై 10 (విజయక్రాంతి): తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీని రాజకీయ కోణంలో చూడొద్దని శానన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యల పై చర్చించేందుకు ఇటీవల ఇద్దరు భేటీ అవడం శుభపరిణామమని పేర్కొన్నారు. నల్లగొండలోని తన కార్యాలయంలో బుధవారం మీడియాతో గుత్తా మాట్లాడారు. విభజన సమస్యలపై పంతాలకు పోకుండా శాశ్వత పరిష్కారంవైపు ఆలోచించాలని సూచించారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని రూ.7 లక్షల కోట్లు అప్పులున్నాయని ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసిందని, ఖర్చులు తగ్గించుకునేందుకు ౧౦ ఎకరాల్లోపు రైతులకే సర్కారు రైతు భరోసా ఇస్తే మంచిదని చెప్పారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ అందించాలని సూచించారు. 2026లో పునర్విభజన చట్టం అమలైతే తెలంగాణలో 34, ఆంధ్రప్రదేశ్‌లో 50 అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశముందని తెలిపారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సహకరించాలని కోరారు.

తెలంగాణకు ఎత్తిపోతల ద్వారా నీటిని తీసుకోవడం తప్ప మరో మార్గం లేదన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఎస్సెల్బీసీ పూర్తయితే నల్లగొండ జిల్లాకు సాగునీటి సమస్య తీరుతుందని స్పష్టంచేశారు. మండలి చైర్మన్ హోదాలో ఉండి రాజకీయాలు మాట్లాడని అన్నారు. పార్టీ ఫిరాయింపులపై గత మండలి చైర్మన్లు, స్పీకర్లు అనుసరించిన విధానాన్నే పాటిస్తానని చెప్పారు. శాసన మండలి రద్దవుతుందని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికి ఇద్దరు మంత్రులు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని వెల్లడించారు. రైతుభరోసాపై ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ జరపడం మంచిదేనని పేర్కొన్నారు.