calender_icon.png 5 December, 2024 | 7:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రికెట్ లీగ్ మ్యాచ్‌లు నిర్వహించొద్దు

09-08-2024 12:33:51 AM

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు  

హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): మెరుగైన జట్లను ఎంపిక చేయకుండా క్రికెట్ లీగ్ మ్యాచ్‌లు నిర్వహించాలంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ రాసిన లేఖ ఆధారంగా ఎలాంటి మ్యాచ్‌లు నిర్వహించరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆటగాళ్ల ఎంపిక నిమిత్తం లీగ్ మ్యాచ్‌లను నిర్వహించాలని హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ రాసిన లేఖను సవాలు చేస్తూ హైదరాబాద్ చార్మినార్ క్రికెట్ క్లబ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టారు.

పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఆటగాళ్ల ఎంపిక నిమిత్తం లీగ్ మ్యాచ్‌లు నిర్వహించాలంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ జూలై 2న రాసిన లేఖ అంబుడ్స్‌మెన్ జూన్ 14న ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ఉందని చెప్పారు. అంతేగాకుండా బైలాస్‌కు విరుద్ధంగా ఉన్నందున లీగ్ మ్యాచ్‌ల నిర్వహణ నిలిపివేయాలని కోరారు. జట్టు ఎంపిక నిమిత్తం ప్లేఆఫ్స్ నిర్వహించి అనంతరం లీగ్‌లు నిర్వహించేలా ఆదేశాలు జారీచేయాలని కోరారు. వాదలను విన్న న్యాయమూర్తి ప్రాథమిక ఆధారాల ప్రకారం అపెక్స్ కౌన్సిల్ రాసిన లేఖ అంబుడ్స్‌మెన్ ఆదేశాలకు, బైలాస్‌కు విరుద్ధంగా ఉన్నందున లీగ్ మ్యాచ్‌లను నిర్వహించరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కౌంటర్లు దాఖలు చేయాలని హెచ్‌సీఏను ఆదేశిస్తూ విచారణను సెప్టెంబర్ 5కు వాయిదా వేశారు.