* ఏఐఆర్‌ఎంఎస్, ఎంఎంఎస్ ఉద్యోగ సంఘం నేతలు
హైదరాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): రైల్వే మెయిల్ సర్వీస్ (ఆర్‌ఎంఎస్), సార్టింగ్ (డిస్ట్రిబ్యూషన్) కార్యాలయాన్ని మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి కాజీపేటకు తపాలాశాఖ తరలించడాన్ని ఆల్‌ఇండియా ఆర్‌ఎంఎస్ అండ్ ఎంఎంఎస్ ఉద్యోగ సంఘాల నాయకులు వ్యతిరేకించారు. దీన్ని నిరసిస్తూ మంగళవారం హైదరాబాద్ అబిడ్స్‌లోని జీపీవో కార్యాలయం వద్ద ఒక రోజు నిరహార దీక్షా కార్యక్రమాన్ని చేపట్టారు. అధికసంఖ్యలో ఉద్యోగులు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏకైక సార్టింగ్ కార్యాలయాన్ని కాజీపేట స్పీడ్ పోస్టు కార్యాలయంలో విలీనం చేసే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. కార్యాలయాన్ని తరలిస్తే ప్రజలకు ప్రభుత్వ సేవలు దూరమవుతాయని, ప్రైవేట్ కొరియర్ సర్వీసుల సేవలకే పరిమితం కావాల్సి ఉంటుందని తెలిపారు.
దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని పేర్కొన్నారు. ఆర్‌ఎంఎస్, సార్టింగ్ కార్యాలయాన్ని జిల్లాలోనే కొనసాగేలా కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు చొరవ తీసుకోవాలని ఒక ప్రకటనలో వారు కోరారు.