పీఏసీ చైర్మెన్ అరేకపూడి గాంధీ
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం
శేరిలింగంపల్లి (విజయక్రాంతి): శేరిలింగంపల్లి సర్కిల్, చందానగర్ సర్కిల్ పరిధిలోని పలు డివిజన్లలో కాలనీలలో చేపట్టిన సీసీ రోడ్లు నాసిరకంగా నిర్మించడం చాలా బాధాకరమని, నాసిరకంగా కనీస నాణ్యత ప్రమాణాలు పాటించకుండా రోడ్లు నిర్మించడం పట్ల శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మెన్ అరేకపూడి గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా నిర్మించిన రోడ్లు నాసిరకంగా ఉండడం వల్ల 6 నెలలలోపే దెబ్బతింటున్నాయని, దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు. అటు ప్రజాధనం కూడా దుర్వినియోగం అవుంతుందని ఎమ్మెల్యే గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, బ్లాక్ లిస్ట్ లో పెట్టి వారికి మళ్ళీ పనులు అప్పగించకూడదని సూచించారు.ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.అధికారుల పర్యవేక్షణ లోపించడం వల్లనే ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయని, ఇంత జరుగుతున్నా ఎందుకు మిన్నకుంటున్నారని ప్రశ్నించారు. అధికారులు తీరు మార్చుకోవాలని, మౌలిక వసతులు కల్పించే క్రమంలో అధికారులు పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని లేదంటే ఉపేక్షించబోమని హెచ్చరించారు. నాణ్యతలోపించిన రోడ్లను కార్పొరేటర్, అధికారులు, కాలనీ వాసులతో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఎస్ ఈ శంకర్ నాయక్,ఈఈ ప్రసాద్, డీఈ ఆనంద్, ఏఈ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.