calender_icon.png 1 November, 2024 | 1:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సభను, ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు

31-07-2024 01:31:40 AM

  1. నేను అనని మాటలను అన్నట్టుగా ఎలా చెప్తారు? 
  2. ఎమ్మెల్యే పల్లాపై డిప్యూటీ సీఎం భట్టి ఆగ్రహం

హైదరాబాద్, జులై 30 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తంచేశారు.  రైతులు పన్నులు కట్టలేదని తాను ఎన్నడైనా అన్నానా? నేను అనని మాటలు అన్నట్టు సభలో మీరు ఎలా మాట్లాడతారు? సభను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తే ఎలా? అని పల్లాను భట్టి ప్రశ్నించారు. ప్రజల పన్నుల చేత వచ్చిన సొమ్మును నాలుగు గోడలు, గడీల మధ్యన కూర్చొని రాసుకుని గుట్టలకు, చెట్లకు, కాలువలకు, రియల్ ఎస్టేట్ భూములకు కాకుండా పంటలను పండించే రైతులను ప్రోత్సహించే విధంగా పంపిణీ చేస్తామని భట్టి వివరించారు.

20 నుంచి 25 వేల కోట్ల రూపాయలను గత ప్రభుత్వం రైతు బంధు పేరిట వ్యవసాయం చేయనివారికి ఇచ్చారని ఆరోపించారు. తమ ప్రభుత్వం అలా చేయకుండా, రైతు భరోసాను ఎలా ఇవ్వాలనే అంశంపై ప్రజల వద్దకు వెళ్లి సలహాలు, సూచనలు తీసుకుంటున్నదని స్పష్టంచేశారు. ప్రజల సొమ్మను దుర్వినియోగం కానీయమని పునరుద్ఘాటించారు. పదేళ్లు అధికారంలో ఉండి పోడు భూములకు పట్టాలు ఎందుకివ్వలేదని, ఇప్పుడు పోడు రైతుల గురించి మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్‌కు లేదని విరుచుకుపడ్డారు. గిరిజన సోదరులు అడవిలోకి పంటలు పండించుకోవాలని వస్తే పోలీసులను పంపించి మహిళలు అని చూడకుండా చెట్లకు కట్టేసి కొట్టించిన చరిత్ర మీదని ధ్వజమెత్తారు. 

ఇది సభనా.. బస్టాండా..? 

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులు పట్టుకుని చప్పట్లు కొట్టడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సభనా? బస్టాండా? అని మండిపడ్డారు. వెల్‌లోకి వచ్చి చప్పట్లు కొట్టడమేంటీ? మంత్రులుగా పని చేశారు? ఇదేం పద్దతి? పదేళ్లు మేం ప్రతిపక్షంలో ఉన్నాం? ఒక్క రోజైనా ఇలా సభా మర్యాదలను ఆగౌరవపర్చే విధంగా చేశామా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పారని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని సీట్లలోకి వెళ్లి కూర్చోవాలని సూచించారు.