calender_icon.png 5 January, 2025 | 9:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘అనంత పద్మనాభుడి’ని పట్టించుకోరా?

03-08-2024 04:44:00 AM

  1. గుట్టపై ప్రేమ జంటల విహారం 
  2. మందుబాబులకు అడ్డాగా పుప్పాలగూడ ఆలయ పరిసరాలు 
  3. సాయంత్రం ఆరుదాటితే ఇక అంతే.. 
  4. చర్యలు తీసుకోవడంలో అధికారుల అలసత్వం

రాజేంద్రనగర్, ఆగస్టు 2: మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడ కొండలపై వెలిసిన అనంతపద్మనాభ స్వామి ఆలయానికి విశిష్ట చరిత ఉంది. అయితే ఆలయ పవిత్రతను కొందరు దెబ్బతీస్తున్నా అధికారులు, పాలకులు పట్టించుకోవడంలేదు. ఆలయం గుట్టల మధ్య ఉండటంతో ప్రేమ జంటలకు, మందుబాబులకు అడ్డాగా మారుతున్నది. సాయంత్రం ఆరు దాటితే చాలు యువతీయువకులు, స్టూడెంట్స్ జంటలుగా ఇక్కడికి వచ్చి ఏకాంతంగా గడుపుతున్నారు. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులు ఏకాంత పక్షులను చూసి తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. కొందరు యువకులు ఆటోలు, కార్లలో వచ్చి మద్యం తాగుతూ నానా రభస సృష్టిస్తున్నారు.

మద్యం సీసాలను భక్తులు వెళ్లే దారిలోనే పగులగొడుతుండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. డీజేలు పెట్టుకుని డ్యాన్సులు చేస్తూ భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో యువతీయువకులు, ప్రేమ జంటలు గుట్టలపై హద్దు మీరి ప్రవర్తిస్తున్నారని ఆలయ కమిటీ ఆలయానికి గేట్లు ఏర్పాటు చేసింది. ఉదయం ఆరు నుంచి 11.30 వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు.

అయినా కూడా మందుబాబులు ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు, ఆలయ కమిటీ నిర్వాహకులు, పోలీసులు కఠిన చర్యలు తీసుకొని స్వామివారి ఆలయ పవిత్రతను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.