- రాస్తారోకో నిర్వహించిన గ్రామస్తులు
ఆర్డీవో కార్యాలయం డీటీకి వినతి పత్రం అందజేత
చేవెళ్ల, జనవరి 24: చేవెళ్ల మండలంలోని ఊరెళ్లను చేవెళ్ల మున్సిపాలిటీలో కలుపొద్దని గ్రామస్తులు డిమాండ్ చేశారు. శుక్రవారం గ్రామంలోనే రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఆర్డీవో, ఎంపీడీవోకు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. అయితే తాము వినతి పత్రం మాత్రమే ఇస్తామని చెప్పడంతో అందుకు అనుమతి ఇచ్చారు. అనంతరం ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి డీటీకి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమది వ్యవసాయ ఆధారిత గ్రామమని, ఎంతో మంది వ్యవసాయంతో పాటు ఉపాధి హామీ పనులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని చెప్పారు. తమకు మున్సిపాలిటీలో కలువడం ఇష్టం లేకపోయినా మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ మున్సిపాలిటీలో కలుపాలని వినతి పత్రం ఇచ్చారని మండిపడ్డారు. ఇప్పుడు కూడా తాము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే వాళ్లే పోలీసులకు సమాచారం ఇచ్చి అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.
తర్వాత తిరిగి వస్తూ బీజాపూర్ హైవేపై మెరుపు ధర్నా చేయడంతో పోలీసులు వారిని స్టేషన్కు తీసుకెళ్లారు. ధర్నాలో దూకుడుగా వ్యవహరించిన ఆసీఫ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేస్తామని చెప్పడంతో గ్రామస్తులంతా అక్కడే కూర్చున్నారు.
అనంతరం సీఐ భూపాల్ శ్రీధర్ అక్కడికి చేరుకొని గ్రామస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనుమతి లేకుండా ధర్నాలు చేయవద్దని, ఎవరిపైనా కేసు పెట్టమని చెప్పడంతో గ్రామానికి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మహమ్మద్ ఆసిఫ్, కావలి కరుణాకర్, బాయికాడి రాములు,బండ్ల భాస్కర్, మంగలి జంగయ్యతో పాటు 70 మంది గ్రామస్తులు పాల్గొన్నారు.