సోరెన్ ప్రభుత్వంలో తారస్థాయికి అవినీతి
కాంగ్రెస్, జేఎంఎం ప్రజల సొమ్మును దోచుకున్నాయి
ఓబీసీలను విభజించి అధికారంలోకి రావాలని చూస్తున్నాయి
బొకారో సభలో ప్రధాని నరేంద్రమోదీ
రాంచీ, నవంబర్ 10: జార్ఖండ్‌లోని హేమంత్ సోరెన్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోరెన్ ప్రభుత్వంలో అవినీతి తారస్థాయికి చేరిందని మైనింగ్ స్కామ్‌ను ఉద్దేశించి ఆరోపించారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎం ఎం), కాంగ్రెస్ కూటమి ప్రజలను దోచుకున్నాయని మండిపడ్డారు. బీజేపీ అధికారం లో వచ్చాక అవినీతికి పాల్పడిన వారిపై కఠి న చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జార్ఖండ్‌లోని బొకారోలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోదీ మాట్లా డుతూ.. ఇసుక, మైనింగ్ అక్రమాల ద్వారా జేఎంఎం కోట్లాది రూపాయల డబ్బును దోచుకుందని, తనిఖీల్లో నోట్ల కట్టల గుట్టలు బయటపడుతున్నాయని ఆరోపించారు.
తాము అధికారంలోకి వచ్చాక ప్రజలకు చెందిన డబ్బును న్యాయంగా వారి ప్రయోజనాలు, భవిష్యత్తు కోసం ఉపయోగిస్తామని స్పష్టం చేశారు. ఓబీసీలను విభజించడానికి కాంగ్రెస్, జేఎంఎం కూటమి ప్రయత్నిస్తోందని మోదీ ఆరోపించారు. వారి ప్రయత్నా లు ఫలించకుండా ఉండాలంటే ప్రజలు ఐక్యంగా ఉండాలని సూచించారు.
ఓబీసీలను విభజించే కుట్ర
కాంగ్రెస్, జేఎంఎం కుట్రల పట్ల జాగ్రత్త గా ఉండాలి. అధికారం కోసం అవి ఎంతకైనా దిగజారుతాయి. దశాబ్దాలుగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఐక్యతకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కుట్రలు చేస్తూనే దేశాన్ని దోచుకుంటోంది. ఓబీసీ ఉపకులాల్లో విభేదాలు సృష్టించి తద్వారా ఐక్యత విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నాయి. కాబట్టి ప్రజల్లో ఐక్యత ఉంటేనే భద్రత ఉంటుంది అని మోదీ పేర్కొన్నారు. అంతేకాకుండా జార్ఖండ్‌లో అక్రమ వలసలను నిర్మూలించాల్సిన అవసరముందని అన్నారు.
జార్ఖండ్‌లో రిక్రూట్‌మెంట్, పేపర్ లీక్ మాఫియాలను జైలుకు పంపుతామని, ఉద్యోగార్థుల భవిష్యత్తుతో ఆటలాడిన వారి ని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కాంగ్రె స్ ప్రభుత్వ హయాంలో జార్ఖండ్‌కు రూ.80 వేల కోట్లు ఇచ్చేందుకు ఇబ్బందులు పడ్డారని, కానీ గత పదేళ్లలో రూ.3 లక్షల కోట్లు కేటాయించామని స్పష్టం చేశారు. అనంతరం జార్ఖండ్ రాజధాని రాంచీకి చేరుకున్న మోదీ ౩ కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించారు.