calender_icon.png 28 September, 2024 | 8:45 AM

మా ఇండ్లు వదలం

28-09-2024 03:13:59 AM

రోడ్డెక్కిన మూసీ నిర్వాసితులు! 

మార్కింగ్ చేసే అధికారులను అడ్డుకున్న స్థానికులు 

లంగర్‌హౌజ్ నుంచి సెక్రటేరియట్ దాకా ర్యాలీ 

పలు ప్రాంతాల్లో ఆందోళనలు

ధర్నాకు దిగిన ఎంపీ ఈటల 

డబుల్ ఇండ్లు కేటాయింపునకు హౌసింగ్ సిబ్బంది

హైదరాబాద్ సిటీబ్యూరో/ ఎల్‌బీ నగర్, కార్వాన్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): మూసీ సుందరీకరణ పనుల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం నిర్వాసితుల నుంచి అధికారులకు తీవ్ర నిరసన సెగ తగిలింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో రెండురోజులుగా జరుగుతున్న నిర్వాసితుల గుర్తింపు సర్వేలో ఉద్రిక్తత వాతావ రణం చోటు చేసుకుంది.

మూసీ రివర్ బెడ్ నివాసాలకు మార్కింగ్ చేసేందుకు బస్తీలు, కాలనీలకు వచ్చిన రెవెన్యూ అధికారులను స్థానికులు అడుగడుగునా అడ్డుకున్నారు. ఉప్పల్ మండలం చైతన్యపురి ప్రాంతంలోని ఫణిగిరి, సత్యానగర్, వినాయకనగర్, లంగర్‌హౌజ్ ప్రాంతంలోని రాజీవ్ గాంధీ కాలనీ, డిఫెన్స్ కాలనీ, అంబర్‌పేట మండలంలోని ముసారాంబాగ్, దుర్గానగర్ బస్తీలలో బాధితులు ఆందోళనకు దిగారు.

మేం ఇక్కడి నుంచి ఎక్కడికి కదిలే ప్రసక్తే లేదని బాధితు లు తేల్చి చెప్పారు. ఎప్పుడూ లేని.. ఎఫ్‌టీఎల్ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందంటూ అధికారులను నిలదీశారు. హైడ్రాకు, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ లంగర్ హౌజ్‌లో బాధితులు ర్యాలీ చేపట్టారు. దీంతో పలు చోట్ల తీవ్ర ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది. బాధితులు ప్రభుత్వాన్ని, అధికారులకు ప్రశ్నల వర్షం కురిపించారు.

నిర్వాసితులకు అండగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, బీజేఎల్‌పీ నేత యేలేటి మహేశ్వర్ రెడ్డి, సీపీఎం, బీఆర్‌ఎస్ తదితర విపక్షాలు మద్దతుగా నిలి చాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మూసీ రివర్ బెడ్ నివాసితులు మొత్తం 2169 ఉండగా, మొదటి రోజు గురువారం 1200 ఇళ్లకు అధికారులు మార్కింగ్ చేశారు. మిగతా ఇళ్లకు మార్కింగ్ కోసం శుక్రవారం వెళ్లిన అధికారులను స్థానికులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. 

డబుల్ ఇళ్ల కేటాయింపు హౌసింగ్‌కు అప్పగింత

హైదరాబాద్ మహానగరంలో మూసీ పరివాహక ప్రాంతంలో రెండురోజులుగా జరుగుతున్న రివ్ బెడ్ నివాసాల మార్కింగ్ నేపథ్యంలో బాధితులకు పునరావాసం కల్పించే బాధ్యతను జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి హౌసింగ్ అధికారులకు బాధ్యత అప్పగించారు.

ఈ మేరకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఖాళీగా ఉన్న డబుల్ ఇళ్లను కేటా యించేలా ఆయా ప్రాంతాలలోని డబుల్ ఇళ్ల లోకేషన్లను పలువురు అధికారులకు కేటాయిస్తూ కమిషనర్ ఉత్తర్వ్యులుఉ జారీచేశారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ హౌసింగ్ ఈఈ నర్సింగ్‌రావు పర్యవేక్షణలో డీఈ సిద్దార్థ, శ్యాంప్లా నాయక్‌లు కేటాయించారు.

ఈ డీఈల కింద పలువురు ఏఈలు, వర్క్ ఇన్‌స్పెక్టర్లను పలు ప్రాంతాలకు కేటాయించారు. పిల్లి గుడిసెలు, జంగంమెట్, జియా గూడ, ప్రతాప్‌సింగారం, సాయి చరణ్ కాల నీ, కమలానగర్, కొల్లూరు  1, గాంధీనగర్, జైభవానీ నగర్, తిమ్మాయి గూడెం ప్రాంతాలలో బాధితులకు డబుల్ ఇళ్లను కేటా యించేలా హౌసింగ్ అధికారులు చర్యలు చేపట్టనున్నారు. అయితే, ఈ ఇళ్ల వద్దకు రెవెన్యూ అధికారులు బాధితులను తీసుకొస్తే.. అక్కడే ఉన్న హౌసింగ్ అధికారులు తక్షణమే వారి ఇళ్లకు సంబంధించిన తాళాలను అప్పగించనున్నారు. 

ప్రాణంపోయినా ఎక్కడికీ వెళ్లం

మూసీ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను గుర్తించి, ఇండ్లపై రెడ్ మార్క్ వేస్తున్నారు. చైతన్యపురి, కొత్తపేట డివిజన్లలోని సత్యానగర్, వినాయకనగర్, ఫణిగిరి, భవానీనగర్, వెంకటాద్రినగర్ తదితర ప్రాంతాల్లో శుక్రవారం ఎంఆర్‌డీసీ, రెవెన్యూ అధికారులు పర్యటించారు. మూసీ నది ప్రాంతంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను గుర్తించి, ఇండ్లను ఖాళీ చేయాలని ఇండ్ల యజమానులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసుల సూచనల మేరకు బాధితులను తరలించేందుకు వచ్చిన డీసీఎం వాహనాలు వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. ఇండ్లను ఖాళీ చేస్తే కోరుకున్న ప్రాంతాల్లో డబుల్ బెడ్‌రూం ఇండ్లను కేటాయిస్తామని, ఆర్థిక భరోసాపై సంక్షేమ పథకాలు అందజేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. 20 ఏండ్లుగా ఇక్కడే ఉంటున్న మేము.. ప్రాణం పోయినా ఇక్కడి నుంచి వెళ్లేదీ లేదని స్థానికులు తేల్చి చెప్పారు. 

మూసీ బాధితులు సెక్రటేరియట్ బాట

లంగర్ హౌస్ డివిజన్ పరిధిలోని రాజీవ్‌గాంధీ నగర్ కాలనీ, డిఫెన్స్ కాలనీ వాసులు శుక్రవారం ఆందోళనకు దిగారు. తాము ఏళ్లనాటి నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నామని, తాము ఎట్టి పరిస్థితుల్లోనూ తమ నివాసాలను సర్కారుకు అప్పగించేది లేదని తెగేసి చెప్పారు. హనుమాన్ ఆలయం వద్ద ఉదయం 10 గంటలకు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.

సుమారు 200 మంది హనుమాన్ ఆలయం నుంచి రింగురోడ్డు పిల్లర్ నంబర్ 102 వద్దకు భారీ ర్యాలీగా చేరుకున్నారు. తాము 20 ఏళ్ల నుంచి ఇక్కడే ఇళ్లు కట్టుకొని ఉంటున్నామని, ఉన్న ఫలంగా వచ్చి ఇళ్లు ఖాళీ చేయాలని అంటే ఎలా అని ప్రశ్నించారు. 100 200 గజాల స్థలాలలో ఇళ్లు కట్టుకొని ఉంటున్నామన్నారు. రూ.50 లక్షల నుంచి కోటి విలువ చేసే ఇళ్లను ఎలా వదులుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.

బాధితులు రింగు రోడ్డు వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సీఎం డౌన్ డౌన్ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు భారీగా బందోబస్తు మోహరించారు. పదిమంది ప్రతినిధులను సెక్రటేరియట్‌కు వెళ్లాలని పోలీసులు సూచించడంతో వారితో కలిసి సచివాలయానికి వెళ్లారు.

అఖిలపక్ష నేతలు స్థానిక ఎంఐఎం కార్పొరేటర్ వజ్జి ఉజ్జమా సిద్ధిఖీ, బీజేపీ నేతలు ఉమారాణి, మాజీ కార్పొరేటర్ ఉదయ్‌కుమార్, ఇంద్రసేనా రెడ్డి, గోపిరెడ్డి నాగేంద్ర ప్రకాష్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నేతలు ఉదయ్, నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు. మూసీ బాధితుల ఆందోళనతో మెహిదీపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలు, అత్తాపూర్ నుంచి వచ్చే వాహనాలు  భారీగా స్తంభించాయి.

పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే కింద వాహనాలు కిలోమీటర్ల మేర ఆగిపోయాయి. వివిధ పోలీస్ స్టేషన్ల లా అండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు భారీ మొత్తంలో రంగంలోకి దిగి వాహనాలను క్లియర్ చేశారు. గంటలకొద్దీ వాహనాలు ఆగిపోవడంతో జనం ఉసూరుమన్నారు.

అప్పడు లేని అధికారులు ఇప్పుడు ఎందుకు వచ్చారు

మీము ఇల్లు కట్టుకుంటామంటే అనుమతులు ఇచ్చిన అధికారులు ఇప్పుడు ఖాళీ చేయడమంటే ఎక్కడి పోతాం. అప్పుడు ఎందుకు పరిష్మన్లు ఇచ్చారు.. ఇప్పుడు ఎందుకు అక్రమ నిర్మాణం అంటున్నారు. ఇడ్లు కట్టుకున్నప్పుడు లేని అధికారులు ఇప్పుడే ఎందుకు వచ్చారు. మీము నీన్న మొన్నా రాలేదు ఇక్కడికి... 20 ఏండ్ల క్రితం వచ్చాం.

ఇప్పుడు డబుల్ బెడ్‌రూం ఇస్తాం అంటున్నారు... అది ఏందుకు. ప్రభుత్వం ఇచ్చే ఇల్లు అమ్ముకొవస్తదా. ఆపద వస్తే ఇక్కడ ఉన్న ఇల్లు అమ్ముకుంటాం.. ఆపద నుంచి బయట పడుతాం. ఎవరూ ఎన్ని చెప్పినా ఇక్కడి నుంచి వెళ్లం. వినాయకనగర్ కాలనీ బాధితులకు వనస్థలిపురంలో ఉన్న డబుల్ బెడ్‌రూం ఇల్లు ఇస్తామని చెబుతున్నారు. 

 వినాయకనగర్ కాలనీ మహిళలు, సత్యానగర్, చైతన్యపురి డివిజన్

బతుకుదెవురు కోసం వచ్చి, ఇల్లు కట్టు కున్నాం

నేను నల్లగొండ జిల్లా అన్నపర్తి గ్రామం నుంచి ఇరువై ఏండ్ల క్రితం బతుకుదెరువు కోసం సత్యానగర్‌లోని వినాయక కాలనీకి వచ్చాను. ఇక్కడే కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను చదివిస్తున్నాను. నాతోపాటు చాలా మంది వలసదారులు ఇక్కడే ఇండ్లు కొన్నారు.

రిజిస్ట్రేషన్ భూమి అని, కరెంట్ బిల్లు, ఇంటి పన్ను, నల్లా బిల్లు ఉన్నాయని చెప్పడంతో అనేక మంది ఇక్కడ జాగ కొని, ఇండ్లు కట్టుకున్నారు. ఇప్పుడు వచ్చి, ఖాళీ  చేయా లని, మీ ఇండ్లు ఎఫ్‌టీఎల్‌లో ఉన్నాయని అంటున్నారు. ఏనాడూ ఇక్కడ ఇండ్లు నీట మునగలేదు... ఎప్పుడూ మూసీ పొంగలేదు. మాకు వచ్చిన ప్రమాదం లేదుగా.. ఎందుకు ఇండ్లు ఖాళీ చేయమంటున్నారు. ప్రాణం పోయినా ఇండ్లను ఖాళీ చేయం.

 అన్నపర్తి యాదగిరి, 

వినాయకనగర్, సత్యానగర్ కాలనీ

నేను చేసిన అప్పు రేవంత్ రెడ్డి తీర్చుతాడా? 

నేను ఇక్కడికొచ్చి పదేండ్లు అవుతుంది. ఇక్కడే కూలీ పని చేసుకుంటూ బతుకుతున్న. చాలా మంది ఇక్కడే ఇండ్లు కొనుకుని ఉన్నారు. నేను కూడా ఇక్కడే ఇల్లు కొనుకున్నా. ఇప్పు డు ఖాళీ చేయమంటే ఎక్కడి పోవాలి. నేను చేసిన అప్పు రేవంత్‌రెడ్డి తీర్చుతడా.

ఎక్కడో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ఇక్కడి భూమికి డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తామంటే ఏమైనా అర్థం ఉన్నదా?. పిల్లల పెండ్లికి ఇల్లు అమ్ముకుంటా... గవర్నమెంట్ ఇచ్చే ఇల్లు అమ్ముకోవస్తదా?. ఎందుకు వారు ఇచ్చే ఇల్లు. మీకు ఇక్కడి నుంచి వెళ్లం.

 లక్ష్మీ, వినాయకనగర్ కాలనీ, సత్యానగర్, చైతన్యపురి