- దేశానికి ఆదర్శంగా నిలిచేలా సర్వే
- సకాలంలో సమగ్రంగా పూర్తి చేయాలి
- ఇప్పటికే 44.1 శాతం సర్వే పూర్తి
- ఆటంకం కలిగించేవారిని ఉపేక్షించొద్దు
- కుటుంబ సర్వేపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచేలా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఏ ఒక్క ఇంటినీ వదిలిపెట్టొదన్ని చెప్పారు.
ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే జరుగుతున్న తీరుపై శుక్రవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో అధికారుల తో సీఎం సమీక్ష నిర్వహించారు. నవంబర్ 6న ప్రారంభమైన ఈ సర్వేను జాప్యం లేకుండా నిర్ధేశించిన కాలపరమితిలో పూర్తి చేయడానికి కృషిచేయాలని అధికారులను ఆదేశించారు.
మొదటి దశలో నిర్వహించిన నివాసాల లిస్టింగ్‌లో మొత్తం 1,16,14,349 ఇళ్లకు మార్కింగ్ చేశారని, ఈ ఇళ్లల్లో ఏ ఒక్క ఇంటినీ వదలకుండా సమగ్రంగా సర్వే నిర్వహించాలని స్పష్టంచేశారు. సర్వే పత్రంలో పేర్కొన్న 56 ప్రశ్నలు, 19 ఉప ప్రశ్నలు మొత్తం 75 ప్రశ్నలు రాష్ర్ట పౌరుల అభ్యున్నతికే సేకరిస్తున్నామని, ఈ సర్వేను గవర్నర్ వివరాలతో ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు.
ఇప్పటివరకు ఈ సర్వేలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని, సర్వేకు కావాల్సిన వివరాలను కూడా ఉత్సాహంగా అందచేస్తున్నారని సమాచారం అం దుతోందని వెల్లడించారు. సర్వేకు ఆటంకం కలిగించేవారిని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించవద్దని స్పష్టంచేశారు. సర్వే జరుగుతున్న తీరును రాష్ర్ట, జిల్లాస్థాయి అధికా రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎటువంటి ఆటంకం లేకుండా జరిగేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
51.24 లక్షల ఇళ్లలో సర్వే పూర్తి
రాష్ర్టవ్యాప్తంగా శుక్రవారం వరకు 44.1 శాతం అంటే 51,24,542 ఇళ్లలో సర్వే పూర్తయిందని, ఈ సర్వేలో 87,807 మంది సిబ్బంది, 8,788 పర్యవేక్షక అధికారులు పాల్గొంటున్నారని, ప్రజల నుంచి స్పందన బాగున్నదని అధికారులు సీఎంకు వివరించారు. 52,493 గ్రామీణ, 40,901 అర్బన్ బ్లాకులుగా మొత్తం 92,901 బ్లాకులుగా విభజించి సర్వే చేస్తున్నట్టు చెప్పారు.
ఈ సర్వే ప్రక్రియను పర్యవేక్షించడానికి సీనియర్ ఐఏఎస్ అధికారులను ఉమ్మడి జిల్లాలవారీగా నియమించామని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సమీక్షలో సీఎస్ శాంతికుమారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు