calender_icon.png 12 October, 2024 | 5:53 PM

పూజల్లో జోక్యం వద్దు

12-10-2024 02:41:42 AM

వైదిక, ఆగమ క్రతువుల్లో తలదూర్చొద్దు

అధికారులకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు

పూజల నిర్వహణపై అర్చకులదే తుది నిర్ణయం

క్రతువుల కోసం ప్రత్యేకంగా పూజారుల కమిటీలు

జీవో 223 జారీచేసిన చంద్రబాబు సర్కారు

అమరావతి, అక్టోబర్ 11: రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో నిత్యం నిర్వహించే ఆగమ, వైదిక క్రతువులు, పూజలు, యజ్ఞాలు, యాగాల్లో ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకోరాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయాల్లో కూడా కార్యనిర్వహణ అధికారులు వైదిక, ఆగమ క్రతువుల్లో జోక్యం చేసుకోవద్దని సూచించింది.

ఇందుకు సంబంధించి గురువారం జీవో నంబర్ 223ను జారీచేసింది. దేశంలో ఇలాంటి ఆదేశాలిచ్చిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశే కావటం గమనార్హం. ప్రతి ఆలయంలో నిత్యం దేవతా మూర్తులకు పూజలతోపాటు ప్రముఖ దినాల్లో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహిస్తారు. వీటి తేదీల నిర్ణయం, ఇతర అంశాలను ఇప్పటివరకు దేవాదాయ శాఖ కమిషనర్లు, రీజినల్ జాయింట్ కమిషనర్లు, డిఫ్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు నిర్వహిస్తూ వస్తున్నారు.

ఇకపై ఈ క్రతువుల నిర్ణయంపై పూర్తి అధికారాలు అక్కడ పనిచేసే అర్చకులే చూసుకొంటారని ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ 1987లోని సెక్షన్ 13 (1) ఆధారంగా ప్రభుత్వం ఈ ఆదేశాలిచ్చింది. 

అన్ని ఆలయాలకు స్వయం ప్రతిపత్తి

వైదిక, ఆగమ శాస్త్రాల ప్రకారం పూజలు, క్రతువులు నిర్వహించేందుకు రాష్ట్రంలోని ప్రతి ఆలయానికి ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి కల్పించింది. ఇందుకోసం అధికారులు సీనియర్  పూజారులతో కమిటీలు వేయాలి. పూజల నిర్వహణపై ఆ కమిటీలే నిర్ణయం తీసుకొంటాయి.

ఏదైనా సమస్య వస్తే పీఠాధిపతుల సలహా తీసుకోవాలని సూచించింది. పూజల నిర్వహణపై ఒక ఆలయానికి మరో ఆలయంపై అజమాయిషీ చేసే అధికారం లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.