తేల్చి చెప్పిన హైకోర్టు
హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై జరుగుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణలో జోక్యం చేసుకోబోమని హైకోర్టు స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి ఆరోపణలు, నిర్మాణంలో లోపాలు, మేడిగడ్డ కుంగుబాటు తదితరాలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, న్యాయవాది బీ రామ్మోహన్‌రెడ్డి వ్యక్తిగత హోదాలో, ప్రొఫెసర్ కోదండరాం, న్యాయవాది ముధుగంటి విశ్వనాథరెడ్డి, బక్క జడ్సన్ వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై చీఫ్ జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టిస్ అనిల్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారాలపై విచారణ పూర్తికాకపోవడంతో ఘోష్ కమిషన్ గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. పిటిషనర్ రామ్మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. అవినీతి వ్యవహారాలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరానని, సింగిల్ జడ్జి వద్ద ఈ పిటిషన్లో సీబీఐ కూడా కౌంటరు దాఖలు చేసిందన్నారు. సీబీఐ తరఫు న్యాయవాది శ్రీనివాస్ కపాటియా వాదనలు వినిపిస్తూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ఈ పిటిషన్లో కేవలం ప్రతివాదిగా కేంద్రాన్ని, సీబీఐనే పేర్కొన్నారని అదనపు ఏజీ ధర్మాసనం దృష్టికి తీసుకురాగా ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేయడానికి అనుమతించాలని న్యాయవాది కోరారు. దీనికి ధర్మాసనం అనుమతిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. కాళేశ్వరం పనులపై పిటిషన్లను ఉపసంహరించుకుంటామన్న బక్క జడ్సన్ తరఫు న్యాయవాది అభ్యర్థనను ధర్మాసనం తిరస్కరించింది.