calender_icon.png 9 November, 2024 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఐసీటీఈ నిర్ణయంలో జోక్యం చేసుకోం

09-11-2024 12:32:50 AM

  1. సుల్తాన్ ఉల్ ఉలూం ఎడ్యుకేషనల్ సొసైటీ పిటిషన్ల కొట్టివేత
  2. పిటిషనర్లకు రూ.50 వేల జరిమానా 
  3. హైకోర్టు కీలక తీర్పు

హైదరాబాద్, నవంబర్ 8 (విజయక్రాంతి): హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెం.3లోని సుల్తాన్ ఉల్ ఉలూం ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇంజినీరింగ్ కాలేజీల అనుమతులను రద్దు చేస్తూ 2017లో ఏఐసీటీఈ ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.

రూల్స్ ప్రకారం కాలేజీల ఏర్పాటు లేకపోతే పర్మిషన్లను రద్దు చేసే అధికారం ఏఐసీటీఈకి ఉందని స్పష్టం చేసింది. విద్యాసంస్థలు ఉన్న భూమికి సంబంధించిన యాజమాన్య స్వాధీన పత్రాలను సొసైటీ సమర్పించలేదు. దీనిపై నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మేరకు అనుమతులు రద్దు అయ్యాయి.

ఈ చర్యపై సుల్తాన్ ఉల్ ఉలూం సంస్థతోపాటు దాని ఆధ్వర్యంలోని కాలేజీలు వేర్వేరుగా 3 పిటిషన్లను 2017లో దాఖలు చేశాయి. దీనితోపాటు ప్రస్తుతం సొసైటీ అధీనంలో ఉన్న భూమిలో 6 ఎకరాలపై హక్కుల కోసం షిమా ఆగ్రోఫామ్స్, ఇతరులు మరో పిటిషన్ వేశారు. వీటన్నింటిపై సుదీర్ఘ వాదప్రతివాదనలు విన్న తర్వాత జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి తుది తీర్పు వెలువరించారు.

సొసైటీ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేయడమే కాకుండా ఆధారాలు లేకుండా రిట్ పిటిషన్లు దాఖలు చేసినందుకు సొసైటీ నిర్వహిస్తున్న మూడు కళాశాలలతో పాటు  కొందరు ప్రైవేట్ వ్యక్తులపై ఒక్కొక్కరికి  రూ. 50 వేలు చొప్పున జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ మొత్తాన్ని మహేంద్రహిల్స్‌లోని శ్రీవిద్యాస్ సెంటర్ ఫర్ స్పెషల్ చిల్డ్రన్ ఆనాథ సంస్థకు ఇవ్వాలని తీర్పులో పేర్కొన్నారు. సొసైటీ పిటిషన్లను కొట్టివేయడంతో విద్యార్థులపై ఏవిధమైన ప్రతికూల ప్రభావం ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది. 

ఏం జరిగిందంటే..

బంజారాహిల్స్‌లోని 24.10 ఎకరాలు 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు చెందినది. ఈ భూమిని మొజాంజా ట్రస్ట్‌కు అప్పగించారు. 1976లో ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని బీహెచ్‌ఎల్‌కు ఇచ్చింది. మొజాంజా విజ్ఞప్తితో విద్యాసంస్థల నిర్వహణ కోసం నాటి ప్రభుత్వం భూసే కరణ నుంచి విడుదల చేసింది.

దీంతో ఆ భూమిని సుల్తాన్ ఉల్ ఉలూం సొసైటీ పలు విడతలుగా డబ్బు చెల్లించి కొనుగోలు చేసి విద్యా సంస్థలను ఏర్పాటు చేసింది. ఈ భూమికి సంబంధించిన ట్రస్ట్ నుంచి యాజమాన్య బదలాయింపు, స్వాధీన పత్రాలను ఉలూం సొసైటీ సమర్పించలేదు. దీంతో ఏఐసీటీఈ అనుమతులను రద్దు చేసింది. 

ఫిరాయింపులపై వేటు వేయాల్సిందే

  1. హైకోర్టులో బీఆర్‌ఎస్ వాదనలు
  2. విచారణ 11కి వాయిదా

హైదరాబాద్, నవంబర్ 8 (విజయక్రాంతి): పార్టీ ఫిరాయింపుల అంశంలో సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్ చేసే అధికారం అసెంబ్లీ కార్యదర్శికి లేదని బీఆర్ ఎస్ హైకోర్టులో వాదనలు వినిపించింది. పలువురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరా యింపులపై బీఆర్‌ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.

రాజ్యాంగంలోని ౧౦వ షెడ్యూల్‌ను ఉల్ల ంఘించిన వ్యక్తులను అనర్హు లుగా ప్రకటించాలనే రాజ్యాంగ లక్ష్యానికి కట్టుబడి ఉండాలంటే, ఫిర్యాదు తర్వాత మూడ్నెల్ల వ్యవధిలో స్పీకర్ వద్ద ఉన్న పిటిషన్లపై విచారణ పూర్తి చేయాలని బీఆర్‌ఎస్ తరఫు లాయర్ మోహన్‌రావు వాదించారు.

లోక్‌సభ, శాసనసభల జీవితకా లం ఐదేళ్లు మాత్రమేనని, వాళ్ల పదవీ కాలం ముగిసే వరకు స్పీకర్ విచారణ చేయకపోతే అర్థమే ఉండదన్నారు. ఈ విషయంలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెట్టకుండా తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను బీఆర్‌ఎస్ గుర్తుచేసింది.

ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు బీఆర్‌ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరడాన్ని సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానంద్, దానం నాగేందర్‌పై ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పిటిషన్లు దాఖలు వేశారు.