13-03-2025 11:42:44 PM
బిజెపి ఎంపీ డీకే అరుణ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి
టిఏజిఎస్ జిల్లా కార్యదర్శి కారం పుల్లయ్య
భద్రాచలం,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో బోయా వాల్మీకి లను ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ బిజెపి ఎంపీ డీకే అరుణ వ్యాఖ్యానించడం పట్ల తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘాలు మండిపడ్డాయి. తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భద్రాచలంలో గురువారం నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశంలో ఎంపీ డి.కే అరుణ మాట్లాడుతూ బోయ వాల్మీకిలను తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీ జాబితాలోకి కలపాలని మాట్లాడడం జరిగిందని,దీనికి నిరసనగా ఎంపీ డి.కే అరుణ దిష్టి బొమ్మ దగ్ధం చేసారు. అనంతరంజరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కారం పుల్లయ్య మాట్లాడుతూ వాల్మీకి బోయాలను ఎస్టీ జాబితాలో కలపాలని బిజెపి ఎంపీ డీకే అరుణ పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడిన మాటలు వెనుకు తీసుకోవాలని లేదంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆదివాసీల అందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని, ఖబర్దార్ డీకే అరుణ అని హెచ్చరించారు. ఇప్పటికే ఉన్న ఆదివాసీల హక్కులు ఉన్నా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని, ఆదివాసీలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఈ తరుణంలో మళ్లీ కొత్త కులాలను వాల్మీకి బోయాలను ఎస్టీ జాబితాలో కలిపితే భవిష్యత్తు బిజెపి పార్టీకి ఆ ప్రజాప్రతినిధులకు మనుగడ ఉండదని హెచ్చరించారు. ఆదివాసీలందరూ ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని ప్రతి గ్రామంలో డీకే అరుణ దిష్టిబొమ్మలను తగలబెట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం భద్రాచలం పట్టణ కార్యదర్శి కుంజా శ్రీను, తుష్టి సుబ్బారావు, కుంజా విజయ, రవ్వ సారిక, మడకం జోగారావు, కొర్స రవి,కె. చంద్ర ప్రసాద్, కోడి నాగేంద్ర, ఎస్ దేవరాజ్, మనోజ్ కుమార్, నందకిషోర్, జి. పండు తదితరులు పాల్గొన్నారు.