calender_icon.png 7 February, 2025 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చొద్దు

07-02-2025 02:02:26 AM

ఆ అధికారం ప్రభుత్వానికి లేదు: హైకోర్టు

హైదరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): చట్టప్రకారం ఉన్న నిబంధనల మేరకే ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చాలని, దానికి విరుద్ధంగా తీసుకున్న ఏ నిర్ణయమైనా చట్టవిరుద్ధమేనని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రైవేట్ పట్టా ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చే అధికారం ప్రభుత్వా నికిగానీ, అధికారులకుగానీ లేదని, దీనికి సంబంధించి చట్టమే స్పష్టంగా పేర్కొందని వెల్లడించింది.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలో వ్యవసాయ భూమిని విక్రయించడానికిగానూ ధరణి పోర్టల్‌లో స్లాట్ బుకింగ్‌కు అవకాశం లేకుండా బ్లాక్ చేయడాన్ని సవాలు చేస్తూ బాచుపల్లికి చెందిన ఎస్ వెంకటసుబ్బయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు.

పిటిషనర్ తరఫు న్యాయవాది కటిక రవీందర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ సర్వే నెం.132/సి/బి/1/2 లోని 1.26 ఎకరాలను సాదా బైనామా కింద కొనుగోలు చేశారన్నారు. 1992లో చట్టప్రకారం క్రమబద్ధీకరించుకున్నారని, దీనికి సంబంధించి పట్టా కూడా జారీ అయిందన్నారు. ఈ భూమిని విక్రయించడానికి  రిజిస్ట్రేషన్ ఫీజు తదితరాలు ఈ చలానా రూ.30.35 లక్షలు చెల్లించి విక్రయం కోసం స్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే బ్లాక్ చేశారన్నారు.

జుల్ఫికర్ అలీఖాన్ అనే వ్యక్తి ఇచ్చిన వినతిపత్రం ఆధారంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) రిజిస్ట్రేషన్ కాకుండా ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఇలా రిజిస్ట్రేషన్‌ను నిలిపేసే అధికారం సీసీఎల్‌ఏకు లేదని తెలిపారు.

ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఏ కింద అనుసరించాల్సిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చలేరని, మార్గదర్శకాలకు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాలు చెల్లుబాటుకావని స్పష్టం చేశారు.

అంతేకాకుండా సెక్షన్ 22ఏ లో ఆస్తులను చేర్చే అంశానికి సంబంధించి వింజమూరి రాజగోపాలాచారి వర్సెస్ రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి కేసులో ఇదే హైకోర్టు ఫుల్‌బెంచ్ మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపారు.

నిషేధిత జాబితాలోని ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయరాదన్న మార్గదర్శకాలను రిజిస్ట్రేషన్ అధికారులు అమలు చేయాల్సి ఉందన్నారు. అందువల్ల పిటిషనర్‌కు చెందిన పత్రాలను పరిశీలించి రిజిస్ట్రేషన్ చట్టం, స్టాంపుల చట్టం ప్రకారం ఉన్నట్లయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఉత్తర్వుల కాపీ అందిన 4 వారాల్లో పూర్తి చేయాలని ఆదేశిస్తూ విచారణను మూసివేశారు.