10 June, 2026 | 2:03 AM

బీసీ ‘ఎ’ గ్రూపులో ఇతర కులాలను చేర్చొద్దు

10-06-2026 12:49 AM

తెలంగాణ బీసీ (ఏ) కులాల హక్కుల పరిరక్షణ సమితి

ముషీరాబాద్, జూన్ 9(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో బీసీ ’ఎ’ గ్రూపులో ముదిరాజ్ కులంతో పాటు ఇతర కులాలను చేర్చరాదని తెలంగాణ బీసీ(ఎ) కులాల హక్కుల పరిరక్షణ సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇతర కులాలను బీసీ ’ఎ’ గ్రూపులో చేర్చడం వల్ల ప్రస్తుతం ఆ గ్రూపులో ఉన్న కులాల హక్కులు, అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంది.

ఈ మేరకు మంగళవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.భాగయ్య, గౌరవ అధ్యక్షుడు గడవ శ్రీహరి, కోశాధికారి అంబటి సుధాకర్, మహిళా విభాగం ప్రతినిధి బండారు శైలజ మాట్లాడారు. బీసీ ’ఎ’ గ్రూపులో చేరేందుకు ముదిరాజ్ కులంతో పాటు ఆంధ్రప్రదేశ్లో తొలగించబడిన 27 కులాలు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు.

ప్రస్తుతం బీసీ ’ఎ’ గ్రూపులో ఉన్న కులాలు ఇప్పటికే పలు సమస్యలు ఎదుర్కొంటున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో మరిన్ని కులాలను చేర్చడం వల్ల ఉన్న అవకాశాలు మరింత తగ్గిపోతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా సమగ్ర అధ్యయనం అనంతరం మాత్రమే చర్యలు చేపట్టాలని వారు కోరారు.

ఈ మేరకు రాష్ట్ర మంత్రులు, సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమర్పించినట్లు తెలిపారు. అలాగే ఇటీవల ప్రభుత్వం కొన్ని కులాల కార్పొరేషన్లకు చైర్మన్ పదవులను కేటాయించినట్లు పేర్కొంటూ తమ కులాలకు చెందిన ప్రతినిధులకు కూడా కార్పొరేషన్లలో అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.