11-04-2025 01:10:44 AM
చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం
కరీంనగర్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యంలో ఎలాంటి తరుగు, కోతలు విధించవద్దని, ధాన్యం కల్లాల వద్ద రైతులకు అన్ని వసతులు కల్పించాలని చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం అన్నారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ తో కలిసి యాసంగి ధాన్యం కొనుగోళ్లపై పౌరసరఫరాల శాఖ అధికారులతో, రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు ప్రభుత్వం ఎటువంటి లోటూ రానివ్వడం లేదని అన్నారు. రెండు లక్షల రూపాయల రుణమాఫీ, రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్ వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యంగా చొప్పదండి నియోజకవర్గంలో ఒక్క గుంట భూమి కూడా ఎండిపోకుండా చివరి ఆయకట్టు వరకు సాగు నీళ్లు ఇస్తున్నామని తెలిపారు.
రైతుకు కావలసిన అన్ని వసతులు, సౌకర్యాలను కల్పించాలని సూచించారు. తేమ, తాలు పేరిట ధాన్యంలో కోతలు, కటింగ్ వంటివి చేయరాదని అన్నారు. రైతులు ఎక్కువ కాలం కల్లాల వద్ద నిరీక్షించకుండా చూడాలని అన్నారు. ధాన్యం రవాణా చేసే లారీలు వెంట వెంటనే ధాన్యాన్ని మిల్లరకు తరలించాలని అన్నారు. రైస్ మిల్లర్ల సమస్యలు ఏవైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రజనీకాంత్, జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు.