calender_icon.png 7 February, 2025 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూజీసీ మార్గదర్శకాలు అమలు చేయొద్దు

07-02-2025 01:29:37 AM

  • చేస్తే.. వీసీలుగా అఘోరాలు, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు 
  • విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి 
  • యూజీసీ గైడ్‌లెన్స్‌ను వ్యతిరేకించాల్సిందే 
  • తెలంగాణ విద్యా కమిషన్ నిర్వహించిన సదస్సులో విద్యావేత్తల గళం

హైదరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాం తి): రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తిని, రాష్ట్ర విశ్వవిద్యాలయాల స్వయంప్రతిపత్తిని పరిరక్షించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మార్గదర్శకాలు  2025ను అమలు చేయొద్దని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించగా.. తెలంగాణ విద్యా కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సు ఇందుకు సంపూర్ణ మద్దతునిస్తూ తీర్మానం చేసింది.

‘యూజీసీ నిబంధనలు  రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో జోక్యం’ అంశంపై హైదరాబాద్ ఎస్సీఈఆర్టీ క్యాంపస్‌లోని గోదావరి కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం ప్రముఖ విద్యావేత్తలతో సదస్సు నిర్వహించారు. దీనికి తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అధ్యక్షత వహించారు.

యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తికి గొడ్డలిపెట్టు

ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. యూజీసీ మార్గదర్శకాలు విశ్వ విద్యాలయాల స్వయం ప్రతిపత్తికి గొడ్డలిపెట్టని అభిప్రాయపడ్డారు. యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని కాపాడాల్సిన యూజీసీనే.. యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు.

యూనివర్సిటీల్లో భావ సంఘర్షణకు ఎంత అవకాశం ఉంటే అంత మంచిదని పేర్కొన్నారు. ప్రొఫెసర్ శాంతసిన్హా మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాల నుంచి వస్తున్న మేధావివర్గంతో ప్రభుత్వం ఇబ్బంది పడుతుందని, అందుకే ఆ వర్గం లేకుండా యూజీసీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రొఫెసర్ డీ నర్సింహారెడ్డి మాట్లాడుతూ..

యూజీసీ మార్గదర్శకాలు ప్రాథమిక హక్కులు, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసేలా ఉన్నాయన్నారు. నూతన విద్యా విధానంతో దేశం ఏమైతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సదస్సులో ప్రొఫెసర్ రమా మెల్కోటే, ప్రొఫెసర్ మురళీ మనోహర్, ప్రొఫెసర్ సత్యనారాయణ, ప్రొఫెసర్ పద్మజాషా, ప్రొఫెసర్ తిరుపతిరావు పాల్గొన్నారు.

వీసీలుగా.. అఘోరాలు, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు..

తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి మాట్లాడుతూ.. యూజీసీ మార్గదర్శకాలను అమలుచేస్తే.. భవిష్యత్‌లో విశ్వవిద్యాలయాలకు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు, అఘోరాలు కూడా వీసీలుగా వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సీబీఐ, ఈడీ, ఎన్నికల కమిషన్ తరహాలోనే యూజీసీని కూడా కేంద్రం తన రాజకీయాలకు వాడుకుంటుందని ఆకునూరి మురళి ఆరోపించారు.

సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. యూజీసీ తన అధికార పరిధిని దాటి సిఫార్సులు చేస్తోందని ఆక్షేపించారు. యూనివర్సిటీల ఆర్థిక అవసరాలను తీర్చేందుకే యూజీసీ ఏర్పడిందని.. కానీ యూనివర్సిటీలను ఆదేశించేందుకు కాదని పేర్కొన్నారు. చాన్సలర్లు, వైస్ చాన్సలర్లు యూనివర్సిటీల్లో భాగం కాదని, వారు అధికారులు మాత్రమేనని తెలిపారు.

ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. విశ్వవిద్యాల యాల్లో స్వేచ్ఛ ఉండాలని, యూజీసీ జోక్యం తగ్గాలని అభిప్రాయపడ్డారు. గవర్నర్లు కేంద్ర రాజకీయాలకు అను గుణంగా పని చేస్తారని, అలాంటప్పుడు వీసీల నియామకాన్ని గవర్నర్లకు అప్పగించడం ఏమిటని అన్నారు. ఏ దేశం లోనైనా.. ఎప్పటికప్పుడు విద్యార్హతలను పెంచుతారని, ఇక్కడ మాత్రం వీసీల నియామక అర్హతను తగ్గించడం ఏంటం టూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విశ్వవిద్యాలయాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించారు.