ఎఫ్‌టీఎల్ ఆక్రమణలపైనే దృష్టి పెట్టాం
మూసీ ప్రక్షాళనపై అపోహలు సృష్టించొద్దు
గత పాలకుల్లా గడీలను మూసుకోలేదు
తలుపులు తెరిచే ఉంచాం.. నిర్మాణాత్మక సలహాలివ్వండి
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
హైదరాబాద్, అక్టోబర్ 7(విజయక్రాంతి): ఎవరినీ ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలన్న ఏకైక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టంచేశారు.
కూల్చివేతల్లో భాగంగా హైడ్రా అధికారులు బఫర్‌జోన్ జోలికి వెళ్లట్లేదని, రివర్‌బెడ్, చెరువుల గర్భాలను కాపాడే లక్ష్యంతో ఎఫ్‌టీఎల్ పరిధి లోని ఆక్రమణలపై మాత్రమే దృష్టి పెట్టినట్టు స్పష్టంచేశారు. సోమవారం హైడ్రా, మూసీ ప్రక్షాళనపై సచివాలయంలో డిప్యూటీ సీఎం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఓఆర్‌ఆర్ పరిధిలోపల ఆక్రమణకు గురైన చెరువుల శాటిలైట్ ఇమేజ్‌లను ప్రదర్శించారు. చెరువుల రక్షణ, మూసీ నది పునరుద్ధరణపై నిరాధారమైన విమర్శలను మానుకోవాలని ప్రతిపక్షాలకు హితవు పలికారు. అపోహలు సృష్టించి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
తాము ప్రజలకు మంచి చేయాలన్న ఉదేశంతో పని చేస్తున్నామని ఉద్ఘాటించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న సరస్సులను ఆక్రమణల నుంచి కాపాడి తీరుతామని స్పష్టంచేశారు. మూసీని ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చిన గత ప్రభుత్వం.. దాన్ని అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు చెరువుల పరిరక్షణపై పెద్దఎత్తున మాట్లాడిన మాటలు వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
చెరువులను పరిరక్షిస్తాం
చెరువులను పరిరక్షించి హైదరాబాద్ నగరాన్ని భావితరాలకు అప్పగించే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకున్నదని భట్టి అన్నారు. హైదరాబాద్ అంటేనే లేక్స్, రాక్స్, పార్క్స్ గా ప్రసిద్ధి చెందిందని చెప్పారు. ఇవి నగర శోభను మరింత పెంచాయని పేర్కొన్నారు. కాలక్రమేణా రాళ్లు అదృశ్యమయ్యాయని, పార్కులు ఆక్రమణలకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
హైదరా బాద్ వాసులకు తాగునీటి వనరులను అందించేందుకు నిర్మించిన చెరువులు కనుమరుగై భారీ వర్షాలు కురిసినప్పుడల్లా ముంపునకు గురికావాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.
హైదరాబాద్‌కు వచ్చే ఎలాంటి ముప్పునైనా తమ ప్రభుత్వం సహించబోదని స్పష్టంచేశారు చెరువుల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకునేందుకైనా వెనకాడేది లేదని పునరు ద్ఘాటించారు. నగరంలోని చెరువులు ప్రజల సొత్తు అని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదన్నారు.
ఇంటి విలువను లెక్కగట్టి చెల్లిస్తాం
మూసీ పరీవాహక ప్రాంతంలో ఇళ్లు కోల్పోతున్న వారిని ప్రభుత్వం గాలికి వదిలేయడం లేదని భట్టి పేర్కొన్నారు. వారికి ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. నిర్వాసితులు కోల్పోతున్న ఇంటి విలువను లెక్కగట్టి పరిహారం చెల్లిస్తామని స్పష్టంచేశారు. మూసీ పరీవాహక ప్రాంతంలో పట్టాలు లేని వారిని కూడా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
తలుపులు తెరిచే ఉన్నాయ్..
సీఎం రేవంత్‌రెడ్డిని ఖబడ్దార్ అంటూ విమర్శిస్తున్నారని, ఇష్టానుసారంగా ప్రభుత్వా న్ని విమర్శించడం సరికాదని భట్టి అన్నారు. హైదరాబాద్‌లోని చెరువులు సీఎం రేవంత్‌రెడ్డివి కానీ, తనకు సంబంధించినవి కావని చెప్పారు. అవి ప్రజలకు చెందినవని, వాటిని జాగ్రత్తగా భవిష్యత్తు తరాలకు అప్పగించాలన్న ఎజెండాతో ప్రభుత్వం ముందుకుసాగు తోందని స్పష్టంచేశారు.
మూసీ ప్రక్షాళనపై విమర్శలను మానుకొని ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని ప్రతిపక్షాలకు సూచించారు. ప్రతిపక్షాల సూచనలను వినడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. వారి సూచనల కోసం తమ తలుపులు తెరిచే ఉన్నాయన్నారు.
ఇందుకోసం అన్ని పార్టీలు ముందుకు రావాలని కోరారు. గత పాలకుల మాదిరిగా గడీలు మూసుకొని కూర్చేలేదని అన్నారు. సూచనలు ఇవ్వడానికి ఆహ్వానించడానికి అవసరమైతే అన్ని పార్టీలకు లేఖలు రాస్తానని చెప్పారు.
హైదరాబాద్ ఎదగడం ఇష్టం లేదా?
మూసీ ప్రక్షాళన గురించి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు భట్టి సూటి ప్రశ్నను సంధించారు. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదగడం, అభివృద్ధి చెందడం ఇష్టం ఉందో? లేదో? బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో సబర్మతి నది ప్రక్షాళన గురించి తెలు సుకోవాలని సూచించారు.
ప్రతిపక్షాలు బాధ్యతగా ప్రవర్తించి ప్రజలకు ఎలా మేలు చేయాలో సూచించాలని హితవు పలికారు. రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ఆరోపణలు చేస్తే భావి తరాలకు తీరని నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు.