calender_icon.png 22 January, 2025 | 6:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పథకాల అమలుపై అపొహలొద్దు

21-01-2025 04:42:37 PM

అర్హులకే లబ్ధి చేకూరుస్తాం

ఎంపిక కాని అర్హుల అర్జీలు స్వీకరణ

గ్రామసభ అవరోధానికి బీఆర్ఎస్ నేతల యత్నాలు

ప్రతి ప్రశ్నకూ జవాబు చెప్పిన ఎమ్మెల్యే 

మానకొండూర్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న నాలుగు కొత్త పథకాలపై ఎలాంటి సందేహాలు వద్దని, అర్హులకే పథకాల ద్వారా లబ్ధిచేకూరుస్తామని  మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ(MLA Kavvampally Satyanarayana) స్పష్టం చేశారు. మంగళవారం బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ లో ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా, కొత్త రేషన్‌కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కోసం లబ్ధిదారు లను గుర్తించేందుకు నిర్వహించిన గ్రామసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఆరు గ్యారంటీ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు సమాయత్త మైందన్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు, రూ.500 గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ సాయం రూ.10లక్షలకు పెంపుతో పాటు రైతులకు రుణమాఫీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గణతంత్ర దినోత్సవం రోజున ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేస్తామన్నారు. 

ఇందిరమ్మ ఇళ్లతో పేదల కల సాకారం

ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుతో ఇళ్లు లేని నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయనున్నామని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి తెలిపారు. గ్రామసభల్లో వెల్లడించే జాబితాల్లో పేర్లు లేని అర్హులైన నిరుపేదలకు మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. వారి అర్జీలను పున:పరిశీలించి తగు న్యాయం చేస్తామన్నారు. ఈ పథకంపై పేదలు పెట్టుకున్న ఆశలు వమ్ము చేయమన్నారు. అర్హులైన నిరుపేదలకు తప్పకుండా లబ్ధి చేకూరుస్తామని డాక్టర్ కవ్వంపల్లి హామీ ఇచ్చారు.

రైతు కళ్లలో ఆనందం చూసేందుకే రైతు భరోసా

రైతు కళ్లలో ఆనందాన్ని చూడాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ఆకాంక్ష అని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. అందుకే రైతు భరోసా కింద ఎకరానికి రూ.12 వేల రూపాయల చొప్పు పెట్టుబడి సాయం అందించనున్నామన్నారు. 26 నుంచి రైతు భరోసా డబ్బులను అర్హులైన రైతుల ఖాతాలో జమ కానున్నాయని ఆయన వెల్లడించారు.

కొత్త రేషన్ కార్డుల జారీతో ఏళ్లనాటి నిరీక్షణకు తెర

గత బీఆర్ఎస్ పాలకుల నిర్లక్ష్యానికి గురైన ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టం చేయడమే కాకుండా కొత్త రేషన్ కార్డుల పంపిణీతో ఏళ్లనాటి ప్రజల నిరీక్షణకు తెరపడనున్నదని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి చెప్పారు. తాజాగా రేషన్ కార్డుల పంపిణీతోపాటు పాత రేషన్ కార్డులలో మార్పులు, చేర్పులు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించిందని ఆయన చెప్పారు.

ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో రైతు కూలీలకూ న్యాయం 

రైతు కూలీలకు కూడా న్యాయం చేయాలనే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం  ఇందిరమ్మఆత్మీయ భరోసా పథకాన్ని ప్రవేశపెడుతోందని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చెప్పారు. రైతు కూలీలకు సంవత్సరానికి 12 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించడం  జరుగుతుందన్నారు. 

గ్రామసభ అడ్డుకోవడానికి గులాబీల యత్నాలు

లక్ష్మీపూర్ లో నిర్వహిస్తున్న గ్రామసభను అడ్డుకునేందుకు కొంత మంది బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించారు. అయితే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ చేపట్టిన పథకాలపైన, ఎన్నికల హామీలపైన ప్రశ్నలు సంధించగా,సభలో ఉన్న ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ వారికి తగిన సమాధానాలు చెప్పారు.అంతే కాకుండా వారి సందేహాలన్నింటినీ ఆయన నివృత్తి చేయడంతో వికసించని గులాబీ లు సభ నుంచి జారుకున్నారు. ఈ గ్రామసభలో మండల పరిషత్ అభివృద్ధి అధికారితోపాటు బెజ్జంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, వైస్ చైర్మన్ సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి,సాదిక్  తదితరులు పాల్గొన్నారు.