calender_icon.png 30 September, 2024 | 7:01 AM

అంగుళం కూడా ఆక్రమణ కావొద్దు

30-09-2024 02:34:55 AM

తహసీల్దార్ల బదిలీలపై త్వరలో సమావేశం 

రెవెన్యూ సిబ్బందికి ట్రైనింగ్ సెంటర్

తహసీల్దార్ల సమావేశంలో మంత్రి పొంగులేటి వెల్లడి

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి) : రాష్ట్రంలో ఒక్క అంగుళం ప్రభుత్వ భూమి కూడా ఆక్రమణ కాకుండా రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తులు, స్థలాలు కాపాడే విషయంలో, పేదలకు అందించే సేవల విషయంలో రెవెన్యూ అధికారులు,  సిబ్బ ంది పనితీరు మెరుగు పర్చుకోవాలని సూచించారు.

శామీర్‌పేట్‌లోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో  33 జిల్లాల తహసీల్దార్లతో మంత్రి పొంగులేటి ఆదివారం ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో  జరిగిన తప్పులను సరిదిద్దుతూ రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం పటిష్టవంతమైన విధానాలను రూపొందిస్తున్నట్టు వెల్లడించారు.

కొత్త రెవెన్యూ చట్టంలో సామాన్యులకు, రైతులకు మేలు జరిగేలా ఉంటుందన్నారు. ఈ ప్రక్రియ చివర దశలో ఉందని చెప్పారు. రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు సిబ్బంది పూర్తి స్థాయిలో సహకరించి, వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

ప్రభుత్వ భూముల పరిరక్షణతోపాటు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అర్హులను గుర్తించి, లబ్ధిదారులకు అందించడంలో రెవెన్యూ యంత్రాంగం పాత్ర కీలకమైందని పేర్కొన్నారు. ఈ నేపథ్యం లో ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ వారథిగా పనిచేస్తుందని తెలిపారు. ప్రజలు కోరుకున్నట్టుగా రెవెన్యూ వ్యవస్థ ఉందా.. లేదా అనే విషయాన్ని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు.

తహసీల్దార్లపై కేసులు నమోదు చేయాలంటే కలెక్టర్ అనుమతి తీసుకోవాలనే అంశంపై డీజీపీతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. రెవెన్యూ సిబ్బంది ట్రైనింగ్ కోసం హైదరాబాద్‌లో ప్రత్యేక సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. గత ప్రభుత్వం మండలాల సంఖ్యను పెంచి, అందుకు తగ్గ కార్యాలయాలు, మౌలిక సదుపాయాలు కల్పించలేదని విమర్శించారు.

ప్రస్తుతం తహసీల్దార్ల కార్యాలయాల్లో మౌలిక వసతులను కల్పించడంతో పాటు రెగ్యులర్ స్టాఫ్, పదోన్నతులు, అద్దె భవనాలు, అద్దె వాహనాల బకాయిలు, కోర్టు ఖర్చులతో పాటు ఎన్ని కల సమయంలో తహసీల్దార్ల బదిలీలపై ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ మాట్లాడుతూ ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ అత్యంత కీలకమైన శాఖ అని అన్నారు. ఈ శాఖ బాగా పనిచేస్తేనే ప్రజలకు మేలు జరుగు తుందని, తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. ఐదేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న 300 మంది ఉద్యోగుల మెడికల్ రీయంబర్స్‌మెంట్ ఫైళ్లను క్లియర్ చేశామన్నారు.

సమావేశంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పొత్రు, డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షులు వి. లచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ అధ్యక్షులు రాములు, ప్రధాన కార్యదర్శి రమేష్ పాల్గొన్నారు.