08-04-2025 01:18:52 AM
నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ, ఏప్రిల్ 7 (విజయక్రాంతి) : పేదల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలులో జాప్యం చేయొద్దని నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణిలో భాగంగా ప్రజల నుంచి సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ అధికారులకు సూచించారు. వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రజావాణికి అధికారులంతా హాజరు కావాలన్నారు. పౌష్టికాహారం ఆవశ్యకతపై దేవరకొండ డివిజన్లో స్థానిక ఎమ్మెల్యే భాగస్వామ్యంతో మరోమారు అవగాహన సదస్సు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించాలని చెప్పారు.
నేటి నుంచి పదిరోజులపాటు జిల్లాలో పోషణ పక్వాడా కార్యక్రమాన్నినిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై సమీక్షించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఇన్చార్జి డీఆర్‌ఓ అశోక్ రెడ్డి, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కోటేశ్వర్రావు తదితరులు హాజరయ్యారు.