calender_icon.png 23 October, 2024 | 11:27 PM

ఆసుపత్రికి వచ్చే రోగుల నుండి ఇష్టారీతిన ఫీజులు వసూలు చేయొద్దు

29-08-2024 03:17:17 PM

వనపర్తి, (విజయక్రాంతి): డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధి లక్షణాలతో రోగులు ప్రైవేట్  ఆసుపత్రికి వస్తె తప్పకుండా రక్త నమూనాలను ఎలిజా పరీక్షలకు పంపించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. జిల్లాలో డెంగ్యూ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో గురువారం ఉదయం వనపర్తి వనపర్తి పట్టణంలోని సుధా నర్సింగ్ హోమ్, సృష్టి హాస్పిటల్ ను కలక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో డెంగ్యూ, మలేరియా వ్యాధులతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని కలిసి మాట్లాడారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఎంత చార్జి వసూలు చేస్తున్నారనే వివరాలతో పాటు సీజనల్ వ్యాధి అనుమానిత రోగుల నుండి రక్త నమూనా సేకరించి ఎలిజా పరీక్షలకు తప్పనిసరిగా పంపించాలని ప్రైవేట్ డాక్టర్లను ఆదేశించారు. 

ఆసుపత్రికి వచ్చే రోగుల నుండి ఇష్టారీతిన ఫీజులు వసూలు చేయవద్దని చికిత్సకు ఎంత చార్జి తీసుకుంటారో సూచిక బోర్డు పెట్టాలని సూచించారు. గర్భిణీలు  ప్రసవానికి వస్తె సిజేరియన్ కాకుండా సాధారణ ప్రసవాలు జరిగేవిధంగ చూడాలన్నారు. తప్పనిసరి అయితే తప్ప  సిజేరియన్ చేయొద్దని సూచించారు. ఇప్పటివరకు జరిగిన ప్రసవాల రిజిస్టరు పరిశీలించారు. సెల్లార్ ను కేవలం వాహనాల పార్కింగ్ కు మాత్రమే ఉపయోగించాలని ఇతర అవసరాలకు ఉపయోగిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. సృష్టి హాస్పిటల్ లోని సెల్లార్ లో ఎక్సేరే గది ఉండటం, ఆక్సిజన్ సిలిండర్లు, ఇతరత్రా సామాన్లు ఉండటం గమనించిన కలక్టర్ మున్సిపల్ ఇంజనీరును పిలిపించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సెల్లార్ లో కేవలం వాహనాలు నిలిపేందుకు తప్ప ఇతర అవసరాలకు వినియోగించడానికి వీలు లేదని తెలిపారు.

వసతి గృహంలో ఉండే విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలి

వసతి గృహంలో ఉండే విద్యార్థులకు మెనూ ప్రకారం  నాణ్యమైన భోజనం పెట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గురువారం  జంగిడిపురం ఎస్సీ  ప్రిమెట్రిక్ బాయ్స్ హాస్టల్ ను సందర్శించిన కలెక్టర్ వసతి గృహంలో విద్యార్థులకు ఉన్న సౌకర్యాలను పరిశీలించారు.  డైనింగ్ హాల్, ఇతర మౌలిక సదుపాయాల కొరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇవ్వాలని ఎస్సి కార్పొరేషన్ ఈ.డి నుషితను ఆదేశించారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని వార్డెన్ ను ఆదేశించారు.  ప్రోగ్రాం ఆఫీసర్ డా. సాయినాథ్ రెడ్డి, ఎస్సి కార్పొరేషన్ ఈ.డి నుషిత,  వైద్యులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.