బతుకమ్మ ఆటపాటలకు ఓ ప్రత్యేకత ఉంది. అయితే, రోజురోజుకు ఆటాడే పద్ధతిని కొందరు మార్చేస్తున్నారు. ఇది బాధాకరం. అనాదిగా, సంప్రదాయంగా వస్తున్న పద్ధతులనే ఆచరించాలి. ఆటపాటలకు ఆధునిక పద్ధతులు రుద్దడం సరికాదు. సినిమా పాటలపై ఆటలు చిత్ర విచిత్రమైన స్టెప్పులతో సనాతన సాంప్రదాయాలకు స్వస్తి చెప్పడం సంస్కారం అనిపించుకోదు.
మన సంస్కృతికి విదేశీయులే ఆకర్షితులవుతుంటే, మనం వాటిని పక్కదారి పట్టించడం అన్యాయం. అలాగే, బతుకమ్మలో ప్రధానంగా తంగేడు, గునుగు పూలే ముఖ్య భూమికను పోషిస్తాయి. గునుగు పూలను కత్తిరించి, రంగుల్లో ముంచి బతుకమ్మను పేర్చేది ‘సద్దుల బతుకమ్మ’ రోజు. గ్రామాలతోపాటు పట్టణాల్లోనూ గతంలో ఇండ్ల పెరళ్లలోనే అనేక పూలు పూచేవి.
అలాగే, ఈ పండగ దినాలు మేదరి కులవృత్తులకు ఒక సంబురం. గౌరమ్మ కోసం ప్రతి ఒక్కరూ వెదురుతో సిబ్బిని చేయించడం ఆచారం. వెదురు సిబ్బి లేకుండా బతుకమ్మ లేదనేంతగా వాటి అవసరం ఉండేది. ఇక, పాటల గురించైతే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో. ఎటు చూసినా డిజే పాటల చప్పుళ్లు, కోలాటాలే. చివరి రోజు చేసే సద్దులన్నీ చిరుధాన్యాలతో చేసేవి. అవి ఆరోగ్యానికి ఎంతో మంచి చేసేవి. బంగారం వంటి ఆ సంస్కృతిని విడనాడక, కొనసాగిద్దాం.
దండంరాజు రాంచందర్ రావు, హైదరాబాద్