calender_icon.png 18 January, 2025 | 12:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భావితరాలపై భారం మోపొద్దు

26-07-2024 12:14:02 AM

ఉచిత పథకాలపై రాష్ట్రాలకు తేల్చి చెప్పిన ఆర్థికమంత్రి మంత్రి నిర్మలమ్మ..!

న్యూఢిల్లీ: వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివిధ వర్గాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న ఉచిత పథకాల్లో స్థిరత్వం తేవాల్సిన అవసరం ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఉచిత పథకాల అమలుతో భవిష్యత్ తరాలపై భారం మోపవద్దని తెలిపారు.‘మీరు (రాజకీయ పార్టీలు) ప్రకటించే ఉచిత పథకాలను ఈనాడు సమర్ధించుకోవచ్చు. కానీ ప్రజాభిప్రాయం ప్రకారం పన్నుచెల్లింపుదారులకు జవాబుదారీగా ఉండాలి. మీరు కొందరు వ్యక్తుల నుంచి పన్ను వసూలు చేసి మరికొందరికి ఇస్తున్నారు.

ఉచిత పథకాలకు అర్హులై ఉండాలి’ అని పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ సమర్పించిన మరుసటి రోజు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మలా సీతారామన్ చెప్పారు. ఏది ఏమైనా, ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం నుంచి తాగునీరు, విద్యుత్, ప్రాథమిక ఆరోగ్యం, విద్యారంగాలకు సరిపడా నిధులు కేటాయించాలని నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాల నుంచి ఎవరైనా లబ్ధి పొందొచ్చు, కానీ ఇతర పన్ను చెల్లింపుదారులపై ప్రతికూల ప్రభావం ఏర్పడకుండా ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. నగదు బదిలీ పథకం, ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర ఐదు హామీలతో గతేడాది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న సంగతిని ఆమె గుర్తుచేశారు. ‘కర్ణాటకలో ఏం జరుగుతోందో చూడండి.

అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధుల్లేవని చెప్పకుండా ఎన్నికల హామీలను తప్పనిసరిగా గౌరవించాలి’ అని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి, పురుషులపై బస్సు ప్రయాణ చార్జీలు రెట్టింపు చేయడం వల్ల కుటుంబాలపైనే భారం పడుతుందని నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు. ఉచిత పథకాలపై నిజాయితీతో కూడిన చర్చ జరగాలన్నారు. ‘ఉచితాలపై మీరు నిజాయితీగా చర్చ పెట్టండి. మీరు ఇచ్చే ఉచిత పథకం ఆమోద యోగ్యం కాదనిచెప్పడం అంత తేలిక కాదు. నేను అమలు చేసే సంక్షేమ పథకాన్ని సమర్ధించుకోవాలి’ అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టుతోపాటు వివిధ విధాన నిర్ణేతలు తరచుగా ఉచిత పథకాలు, సంక్షేమ పథకాల మధ్య తేడాలు చెప్పడం చాలా కష్టం అని చెబుతున్న విషయం తెలిసిందే.